హైదరాబాద్, ఆంధ్రప్రభ: త్వరలో టీచర్ల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుండటంతో ఎస్జీటీ పోస్టుకు ఎవరు అర్హులు? కాదు? అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో అభ్యర్థుల్లో గందరగోళం ఏర్పడింది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్సీటీఈ) 2018 జూన్‌లో విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారమైతే ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు కూడా అర్హులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో త్వరలో వెలువడే టీచర్ పోస్టుల భర్తీలో ఎస్జీటీ పోస్టుకు బీఈడీ అభ్యర్థులు కూడా పరీక్ష రాయొచ్చు. అసెంబ్లిdలో సీఎం కేసీఆర్ ప్రకటిస్తూ 13వేలకు పైగా పాఠశాల విద్యాశాఖలో పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. టీచర్ బదిలీల ప్రక్రియ అనంతరం ఏర్పిడిన ఖాళీలను కలుపుకుంటే మొత్తం 19 వేల పోస్టులు ఉంటాయి. ముందస్తుగా ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈ 13 వేల పోస్టుల్లో సుమారు ఆరేడు వేల వరకు ఎస్జీటీ పోస్టులు కాగా మిగతావి స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, హిందీ పండిట్ పోస్టులు ఉండనున్నాయి. రాష్ట్రంలో డీఈడీ చేసేని వారు దాదాపు లక్షా 30వేల మంది, బీఈడీ చేసీన వారు సుమారు 3 లక్షల మందికి పైగా ఉన్నారు.
ప్రస్తుతం చేస్తున్న వారు అదనం. దీంతో రాష్ట్రంలోని దాదాపు 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఎస్జీటీ పోస్టు, స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు పోటీ పడే అవకాశం ఉంది. మొత్తం అభ్యర్థుల్లో కేవలం 3 నుంచి 4 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులే స్కూల్ అసిస్టెంట్ పోస్టులతోపాటు ఎస్జీటీ పోస్టులకూ అర్హులు కానున్నారు. అయితే ఎన్సీటీఈ నిబంధనలు ప్రకారం ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు టీచర్‌గా ఎంపికయ్యే బీఎడ్ అభ్యర్థి తాను నియామకం అయిన తేదీ నుంచి రెండేళ్లలోపు తాము గుర్తించిన విద్యా సంస్థ నుంచి ఎలిమెంటరీ విద్య(బ్రిడ్జి కోర్సు)లో ఆరు నెలల కోర్సును పూర్తి చేయాలని ఎన్సీటీఈ నిబంధనలు చెప్తున్నాయి. ఈ క్రమంలో బీఈడీ అభ్యర్థులు ఎస్జీటీ పోస్టుకు అర్హులేనని తెలుస్తోంది.
ఎస్జీటీ పోస్టు మధ్య బీఎడ్, డీఎడ్ వివాదం…
ప్రస్టుతం ఎస్జీటీ పోస్టులను బీఎడ్ అభ్యర్థులకు ఎలా కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. బీఎడ్‌లో చైల్డ్ సైకాలజీ లేదని, చిన్న పిల్లలకు బీఎడ్ అభ్యర్థులు బోధించేందుకు అర్హులు కాదనే వాదనను డీఎడ్ చేసే అభ్యర్థులు లేవనెత్తుతున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టుకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) అభ్యర్థులే అర్హులంటూ 2008లో డీఎడ్ అభ్యర్థుల సంఘం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 2010లో ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులని, బీఎడ్ అభ్యర్థులు అర్హులు కాదని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. అలాగే 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు బీఎడ్ వారు అర్హులు కాదని 2010 ఆగస్టు 23న ఎన్సీటీఈ
గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వారిని స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే పరిమితం చేసింది.
అయితే ఆ తర్వాత ఎస్జీటీ పోస్టుకు తమకూ అవకాశం ఇవ్వాలని బీఎడ్ అభ్యర్థులు ఎన్సీటీఈని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో 50 శాతం మార్కులతో డిగ్రీ, బీఎడ్ పూర్తి చేసిన వారు 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు అర్హులేనని 2018లో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎస్జీటీగా నియామకం అయిన రెండేళ్లలో ఎలిమెంటరీ విద్యలో 6 నెలల బ్రిడ్జి కోర్సును పూర్తి చేయాలనే నిబంధనను పెట్టింది.
తమకే అవకాశమివ్వాలి…
బీఈడీ చేసిన వారు ఎస్జీటీ పోస్టులకు ఎలా అర్హులవుతారని డీఈడీ అభ్యర్థులు అంటున్నారు. తాజాగా వేయబోయే నోటిఫికేషన్లో ఎస్జీటీ పోస్టులను డీఎడ్ అభ్యర్థులతోనే నింపాలని కోరుతున్నారు. లేకపోతే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మరోసారి కోర్టును ఆశ్రయించే ఆలోచనలో డీఎడ్ అభ్యర్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారమైతే ఎస్జీటీ పోస్టులను డీఎడ్ అభ్యర్థులతోనే నింపాల్సి ఉంటుందని రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం నాయకులు రామ్మోహన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎస్జీటీ పోస్టులకు సరిపడా డీఎడ్ అభ్యర్థులు లేనప్పుడే బీఎడ్ అభ్యర్థులతో వాటిని నింపాలి. కానీ రాష్ట్రంలో లక్షన్నరకు పైగా డీఎడ్ అభ్యర్థులున్నారు.