Tuesday, November 26, 2024

ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు.. ప్రత్యేకతలివే!

ఏపీలో కాలుష్య నియంత్రణ దిశగా రాష్ట్రంలో తొలిసారిగా ఆర్టీసీలో విద్యుత్‌ బస్సులను ప్రవేశపెడుతున్నారు. తొలిదశలో రాష్ట్రంలో 350 ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఆర్టీసీ అద్దె బస్సుల విధానంలో వీటిని ప్రవేశపెడతారు.  ఏసీ సర్వీసులుగా ఉండే ఈ బస్సులను తిరుమల–తిరుపతి మధ్య (100 బస్సులు), అమరావతి (విజయవాడ–గుంటూరు.. 100 బస్సులు), విశాఖపట్నంలో (100 బస్సులు).. కాకినాడలో 50 బస్సులు నడుపుతారు. రూ.500 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది.

తిరుమల–తిరుపతి ఘాట్‌ రోడ్డులో ప్రయాణం కోసం 9 మీటర్ల పొడవున్న బస్సులను, మిగిలిన చోట్ల 12 మీటర్ల పొడవున్న బస్సులు ఏర్పాటు చేయనున్నారు. విశాఖపట్నంలో బస్సు ఫ్లోర్‌ భూమి నుంచి 40 సెంటీమీటర్ల ఎత్తులో ఉండేవి, మిగిలిన చోట్ల 90 సెంటీమీటర్ల ఎత్తులో ఉండేవి నడుపుతారు. 9 మీటర్లు పొడవున్న బస్సు ధర రూ.1.25 కోట్లు, 12 మీటర్ల పొడవున్న బస్సు ధర రూ.1.50 కోట్లుగా ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ‘ఫాస్టర్‌ అడాప్షన్‌ మాన్యూఫాక్చరింగ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ (ఫేమ్‌) పథకం కింద 9 మీటర్ల బస్సుకు రూ.45 లక్షలు, 12 మీటర్ల బస్సుకు రూ.55 లక్షల వంతున రాయితీ ఇస్తుంది.  

డీజిల్‌ ధరలు ఇటీవల కాలంలో బాగా పెరగడంతో ఆర్టీసీపై నిర్వహణ వ్యయం అధికమవుతోంది. డీజిల్‌ బస్సుల కంటే ఎలక్ట్రిక్‌ బస్సులతో నిర్వహణ వ్యయం తగ్గుతుంది. రోజుకు 300 కిలోమీటర్లు ప్రయాణం చేసే 12 మీటర్ల పొడవున్న డీజీల్‌ ఏసీ బస్సుకు కి.మీ.కి రూ.52 ఖర్చవుతుంది. అదే ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సుకు రూ.48 అవుతుంది. ఇక 9 మీటర్ల పొడవు ఉన్న ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సుకు కి.మీ.కు రూ.45 అవుతుంది. ప్రస్తుతం ఆర్టీసీలో 9 మీటర్ల పొడవున్న డీజిల్‌ బస్సులు లేవు. ఇక ఎలక్ట్రిక్‌ బస్సులు నుంచి ఏమాత్రం కాలుష్యం విడుదల కాదు. దాంతో కాలుష్యం తగ్గి పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. ఈ బస్సుల నిర్వహణ కోసం ఆర్టీసీ డిపోల్లోనే అవకాశం కల్పించి, నిర్వాహకుల నుంచి చార్జీలను వసూలు చేస్తారు. డిపోల్లో బస్సుకు ఓ చార్జర్‌ ఏర్పాటు చేస్తారు. ఇక అత్యవసరాల కోసం పది బస్సులను ఒకేసారి చార్జింగ్‌ చేసేందుకు ‘ఫాస్ట్‌ చార్జర్లను’ బస్‌ టెర్మినల్‌ పాయింట్లలో అందుబాటులో ఉంచుతారు.

ఎలక్ట్రిక్‌ బస్సుల ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా ఆమోదించిన ప్రభుత్వం.. జ్యుడిషియల్‌ ప్రివ్యూకు నివేదించమని ఆర్టీసీని ఆదేశించింది. ఆర్టీసీ అధికారులు ఒకటి రెండు రోజుల్లో జ్యుడిషియల్‌ ప్రివ్యూకు పంపనున్నారు. అక్కడ ఆమోదం లభించిన అనంతరం టెండర్ల ప్రక్రియ చేపడతారు. పర్యావరణ పరిరక్షణ కోసం సంప్రదాయేతర ఇంధన వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ముందడుగు వేస్తూ ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఆర్టీసీకి అనుమతి ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement