Friday, November 22, 2024

TS | మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలు.. సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్‌

నల్గొండ/సూర్యాపేట, (ప్రభన్యూస్‌): మెడిక‌ల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల నియామ‌కాల‌కు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దీంతో నల్లగొండ, సూర్యాపేట మెడికల్‌ కళాశాలలకు పోస్టులు మంజూరు సహా… అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలు జ‌ర‌గ‌నున్నాయి. నల్లగొండ మెడికల్‌ కళాశాలలో 42, సూర్యాపేట మెడికల్‌ కళాశాలలో 45 పోస్టులను తక్షణమే నియమించాలంటూ అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏకకాలంలో ఇంత పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టడం ద్వారా వైద్య రంగంలో నూతనాధ్యాయం సృష్టించినట్లైంది.

నల్లగొండ జిల్లా కేంద్రంలోని మెడికల్‌ కళాశాలలో మొత్తం 42 పోస్టులకు గాను జనరల్‌ మెడిసిన్‌ (5), జనరల్‌ సర్జన్‌ (6), ఆర్థోపెడిక్‌ (2), పిడియాట్రిక్‌ (4), వోబీజీ (8), అనస్థీషియా (7), అనాటమీ (1), పథాలజీ (1), మైక్రో బయాలజీ (1), ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ (1), రేడియో డయాగ్నిస్‌ (2), బయో కెమిస్ట్రీ (1), కమ్యూనిటీ- మెడిసిన్‌ (1), ట్రాన్స్‌ ఫ్యుజన్‌ మెడ్‌ (1), ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్‌ (1) చొప్పున వివిధ విభాగాలకు కలిపి మొత్తం 42 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలు జరగనున్నాయి.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మెడికల్‌ కళాశాలలో జనరల్‌ మెడిసిన్‌ (5), జనరల్‌ సర్జన్‌ (7), ఆర్థోపెడిక్‌ (3), పిడియాట్రిక్‌ (5), ఓబీజీ (8), అనస్థీషియా (7), పథాలజీ (2) రేడియో డయాగ్నిస్‌ (3) పోస్టులు, మైక్రో బయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, ఈఎన్‌టీ, అనాటమీ, ఆప్తాల్‌, కమ్యూనిటీ- మెడిసిన్‌ విభాగాలకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 45 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి చేసిన సిఫార్సులకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement