Tuesday, November 26, 2024

త్వరలో అప్పనపల్లి రెండవ ఆర్వోబీ ప్రారంభం .. వేముల, శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్: అప్పనపల్లి రెండవ ఆర్వోబీని త్వరలో ప్రారంభిస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభానికి వెళ్తూ మధ్యలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బి ద్వారా చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రి తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఒకప్పుడు మహబూబ్ నగర్ లో ఇరుకురోడ్లతో ఎన్నో ఇబ్బందులు ఉండేవని, అలాంటిది శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే, మంత్రి అయిన తర్వాత జడ్చర్ల పట్టణం నుండి నాలుగు లైన్ల రహదారి ఏర్పాటు చేయడం, జంక్షన్ల అభివృద్ధి, మహబూబ్ నగర్ పట్టణం మొత్తం సర్వాంగ సుందరంగా అయిందని అన్నారు. ముందుగా అప్పన్నపల్లి రెండవ రైల్వే ఓవర్ బ్రిడ్జిని పరిశీలిస్తూ.. కేవలం 12 నెలల్లోనే దీనిని పూర్తి చేయడం పట్ల రాష్ట్రమంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ కృషి, పట్టుదల అర్థమవుతుందన్నారు. అనంతరం ఆర్ అండ్ బి చౌరస్తాలో జంక్షన్ అభివృద్ధి పనులను సైతం మంత్రి తనిఖీ చేశారు.

అశోక్ థియేటర్ చౌరస్తాలో చేపట్టిన రహనుమియా బ్రిడ్జి పనుల తనిఖీ చేసిన అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. అప్పన్న పల్లి మొదటి ఆర్ ఓ బి ని 12 సంవత్సరాల్లో నిర్మించగా, 2వ ఆర్ ఓ బి ని కేవలం 12 నెలల్లో నిర్మించడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి బ్రిడ్జిని నిర్మించేందుకు కనీసం మూడు సంవత్సరాలు పడుతుందని, అలాంటిది వేగవంతంగా నిర్మాణం పూర్తి చేయడం పట్ల ఆయన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను అభినందించారు. జూన్ రెండు లోగా ఈ బ్రిడ్జి నిర్మాణం పనులను పూర్తి చేసి ఆర్ ఓ బీని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాక రహనూమియా బ్రిడ్జిని కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా ఆయన కోరారు. రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… గతంలో జడ్చర్ల నుండి మహబూబ్ నగర్ కు వచ్చే వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడమే కాక అనారోగ్యం పాలైన వారు ఎంతోమంది రహదారిపైన ప్రాణాలు వదిలేసేవారని, అలాంటిది 12 నెలల్లోనే రెండవ ఆర్ వో బి ని పూర్తి చేయడం, వలసలకు మారుపేరైన పాలమూరు జిల్లాలో అన్ని రకాల సౌకర్యాలను, అన్నివర్గాల వారికి ఏర్పాటు చేయడం, ఇప్పుడు పాలమూరుకే వలస వచ్చే విధంగా తీర్చిదిద్దామన్నారు. నెల రోజుల్లో అప్పనపల్లి రెండవ ఆరోబి ని పూర్తి చేసి ప్రారంభించేందుకు ఆర్ అండ్ బి శాఖ మంత్రి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం సంతోషమని, అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణం వరకు ఉన్న ఆర్ అండ్ బీ రహదారులు, ఇతర పనులను సైతం త్వరలోనే పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ ఆదనపు కలెక్టర్ కె.సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement