Saturday, November 23, 2024

యోగా వల్ల ఒకే దేశం-ఒకే ఆరోగ్యం: మోదీ

కరోనా విపత్తు వేళ యోగా ఆశా కిరణంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. యోగా ద్వారా ప్రతి దేశం, సమాజం స్వస్థత పొందుతాయన్నారు. కరోనా కారణంగా భారత్ సహా పలు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయన్న మోదీ.. దేశంలో లక్షలాదిమంది యోగ సాధకులుగా మారారన్నారు.

యోగాను ఆరోగ్య ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యోగా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లినట్టు చెప్పారు. కరోనా మహమ్మారిపై ప్రతి ఒక్కరు పోరాడాల్సి ఉందని అన్నారు. యోగాను రక్షణ కవచంగా మార్చుకోవడం ద్వారా రోగ నిరోధకశక్తి మెరుగవుతుందని, దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడడంతోపాటు శారీరక, మానసిక దృఢత్వం లభిస్తుందని మోదీ పేర్కొన్నారు. కరోనా వెలుగుచూసినప్పుడు దానిని ఎదుర్కొనేందుకు ఏ దేశమూ సిద్ధంగా లేదన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో త్వరలోనే ఎం-యోగా అప్లికేషన్‌ను ప్రారంభిస్తామన్నారు. ఇందులో యోగా శిక్షణకు సంబంధించి పలు భాషల్లో వీడియోలు ఉంటాయన్నారు. దీనివల్ల ‘ఒకే దేశం-ఒకే ఆరోగ్యం’ లక్ష్యం సాకారమవుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement