Tuesday, November 26, 2024

ఇకపై మరింత చేరువగా ఏపీఐఐసీ.. 14 సేవలు ఆన్ లైన్ ద్వారా ప్రారంభం

ఏపీఐఐసీ సేవలు ఇకపై మరింత చేరువ కానున్నాయి. ప్రజలు, పారిశ్రామికవేత్తలకు మరింత జవాబుదారీగా నిలిచి, సేవలను చేరువ చేసే కార్యక్రమానికి ఏపీఐఐసీ శ్రీకారం చుట్టింది. దరఖాస్తు నుంచి మొదలై అనుమతులు, భూ కేటాయింపులు సహా అన్నింటినీ ఆన్ లైన్ ద్వారా పారిశ్రామికవేత్తలకు అందించేందుకు సిద్ధమైంది. 14 సేవలు అందించేలా ఏపీఐఐసీ తీర్చిదిద్దిన ఈ వెబ్ పోర్టల్ ను మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ లాంఛనంగా ప్రారంభించారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ.. సమయభావాలకు ఆస్కారం లేని విధంగా గడువు నిర్దేశించుకుంటూ పని చేసే సాంకేతిక వ్యవస్థని అందుబాటులోకి తీసుకువచ్చిన ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని అధికారుల బృందాన్ని ఆయన అభినందించారు. జిల్లా స్థాయిలో పరిశ్రమల శాఖకు చెందిన జనరల్ మేనేజర్లు, ఏపీఐఐసీకి చెందిన జోనల్ మేనేజర్లు కలిసి పని చేసి మరిన్ని మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. www.apindustries.gov.in కు ఏపీఐఐసీ సేవలు అనుసంధానమవడమే కాకుండా పారిశ్రామికవేత్తలకు ఈ సేవలన్నీ నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. జిల్లాల విభజన నేపథ్యంలో పరిశ్రమల శాఖపై మరింత ఎక్కువ బాధ్యత ఉన్నట్లు స్పెషల్ సీఎస్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement