Friday, November 22, 2024

Politrics: తెలంగాణ‌లో పీకే కాక.. అంత‌టా వాడివేడి చర్చలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో రెండు రోజులపాటు జరిగిన సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో పంచాయితీకి తెరతీసింది. గతంలో తెరాసతో జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు జరిగిన ఒప్పందంపై సంతకాలు చేసేందుకు ప్రశాంత్‌ కిషోర్‌ కేసీఆర్‌తో భేటీ అయ్యారని అధికార తెరాస పార్టీ చెబుతోంది. అయితే కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇందుకు భిన్నమైన ప్రకటన చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెరాసతో ప్రశాంత్‌ కిషోర్‌ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకే ఆయన ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారని చెప్పారు. ఇదిలాఉండగా కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ సోమవారం కేసీఆర్‌-పీకే సమావేశంపై చేసిన ట్వీట్‌ గందరగోళానికి దారితీసింది. శతృవుతో స్నేహం చేసే వారిని నమ్మొద్దంటూ ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

చిన్న అవకాశం దొరికినంత కాలం నమ్మకాన్ని కోల్పోమంటూ గాంధీ చేసిన సూక్తిని ఆయన తన ట్వీట్‌కు జత చేశారు. ఈ ట్వీట్‌ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. మరోవైపు బీజేపీ ఓబీసీ సెల్‌ జాతీయ అధ్యక్షుడు డా. లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ… ప్రధాని మోడీని మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ లక్ష్యమని ఆరోపించారు. కాంగ్రెస్‌, తెరాస, ప్రశాంత్‌ కిషోర్‌తో కలిసి పనిచేసేందుకు సీఎం కేసీఆర్‌ ప్రణాళిక రూపొందించారని, అందులో భాగంగానే ప్రశాంత్‌ కిషోర్‌ను పిలిపించుకుని సమాలోచనలు జరిపారని ఆరోపించారు. ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్‌తో కలిసి కేసీఆర్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారని లక్ష్మణ్‌ అనుమానం వ్యక్తంచేశారు. తెరాస, కాంగ్రెస్‌లు చీకటి ఒప్పందం చేసుకున్నారని, అందులో భాగంగానే ప్రశాంత్‌ కిషోర్‌ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రశాంత్‌ కిషోర్‌తో జరిగిన ఒప్పందంపై రాష్ట్ర పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆరే పెద్ద మేథావి, ఎన్నికల్లో ఎలా వ్యూహం రచించాలో కేసీఆర్‌కు మించిన నాయకుడు ఎవరూ దేశంలో లేరని చెప్పారు.

గతంలో మోడీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిషోర్‌ వ్యవహరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రశాంత్‌ కిషోర్‌ ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో జరిగిన భేటీపై ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీ. రామారావు స్పందిస్తూ… ప్రశాంత్‌ కిషోర్‌ వల్ల తెరాసకు ప్రయోజనం ఉండొచ్చన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రశాంత్‌ కిషోర్‌ ఆకాశం నుంచి ఏదో తెస్తారని తాము భావించడం లేదని, ఆయనకు మించిన వ్యూహకర్త సీఎం కేసీఆర్‌ అని పేర్కొన్నారు. కేసీఆర్‌ ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేశారు.

కాంగ్రెస్‌లో అలజడి…
తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రశాంత్‌ కిషోర్‌ వ్యవహారం కాకపుట్టిస్తోంది. పార్టీలోకి ఆయన రాకపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ప్రశాంత్‌ కిషోర్‌ సీఎం కేసీఆర్‌తో భేటీ కావడం హస్తం పార్టీలో అలజడి రేపుతోంది. ఈ క్రమంలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌ చేసిన ప్రకటనలు మంటలు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో పీకే చేరితే తమ పరిస్థితి ఏంటని కొందరు సీనియర్‌ నాయకులు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ఎనిమిదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉండి విపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్లు ఈసారైనా గెలిచి ప్రభుత్వంలో స్థానం దక్కుతుందన్న ఆశాభావంతో ఉన్నారు. ప్రశాంత్‌ కిషోర్‌ చేరితే ఆయన లెక్కలు వేరే ఉంటాయని, సర్వేలు నిర్వహించి ఓటర్లు, ప్రజల నుంచి తీసుకునే అభిప్రాయాల మేరకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తారని నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్‌ ఎలా ఉంటుందోనన్న ఆందోళన కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement