ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌కు ఊహించని షాక్ తగిలింది. అఖిలేశ్ మరదలు, ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ భార్య అపర్ణ యాదవ్ బుధవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఆమెకు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.
గత ఎన్నికల్లో ఎస్పీ నుంచి బరిలోకి దిగిన అపర్ణ.. బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే, ఇటీవలి కాలంలో ఆమె బీజేపీ ప్రభుత్వ విధానాలకు మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నారు. దీంతో ఆమె బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. అయితే, ఈ ఊహాగానాలను నిజం చేస్తూ ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని ఇటు బీజేపీ, అటు ఎస్పీ పార్టీలు వ్యూహా రచన చేస్తున్నాయి. ఈ క్రమంలో వలసలను ప్రోత్సహిస్తున్నాయి.