Friday, November 22, 2024

రాజధాని తరలింపు లేనట్లే!

ఏపీలో మూడు రాజధానుల బిల్లుకు సంబంధిత దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఉన్నత న్యాయస్థానం త్రిసభ్య ధర్మాసనం వ్యాజ్యాలను విచారిస్తోంది. మే 3 నుంచి రోజువారీ విచారణ చేయనున్నట్లు హైకోర్టు వెల్లడించింది. ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన అతి ముఖ్యమైన రాజధాని పిటిషన్లను హైకోర్టు ఆన్ లైన్ ద్వారా కాకుండా నేరుగా విచారించాలని అడ్వకేట్ డిఎస్ఎన్వీ ప్రసాద్ బాబు కోరారు. వీలైనంత త్వరగా హై కోర్టు నేరుగా ఈ కేసులు విచారించాలని ఏజీ శ్రీరాం కోరారు.

ఈ ఏడాది జనవరిలో ఛీఫ్‌ జస్టిస్ మార్పు తర్వాత హైకోర్టులో పెండింగ్‌లో పడిన విచారణ ఇవాళ మొదలైంది. అయితే హైకోర్టు ఈ పిటిషన్లపై విచారణను మే 3 నుంచి రోజువారీ విచారిస్తామని తెలిపింది. దీంతో ఈ ఏడాది రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్‌ పడినట్లయింది. హైకోర్టు నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వం కూడా రాజధాని తరలింపును వచ్చే ఏడాదికి వాయిదా వేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లులు గవర్నర్‌ ఆమోదం పొందినా, ఈ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గతేడాది కొందరు హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లన్నీకలిపి హైకోర్టు రోజువారీ విచారణ చేపట్టింది. అయితే విచారణ తుది దశకు చేరుకుంటున్న తరుణంలో ఛీఫ్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరి బదిలీపై వెళ్లిపోయారు. దీంతో ఈ పిటిషన్లపై విచారణ నిలిచిపోయింది. జనవరిలో నిలిచిపోయిన ఈ విచారణను.. ఏపీ హైకోర్టు కొత్త ఛీఫ్ జస్టిస్ అరూప్‌ గోస్వామి ఇవాళ తిరిగి ప్రారంభించారు. అయితే, ఈ పిటిషన్లను మే 3 నుంచి రోజువారీ విచారణ చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement