Tuesday, November 26, 2024

‘వకీల్ సాబ్‌’ పై హై కోర్టు కీలక తీర్పు!

ఏపీలో వకీల్ సాబ్ సినిమా టికెట్లు రేట్లు పెంపు అంశం వివాదంగా మారిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. డిస్ట్రిబ్యూటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది కోర్టు. మొదటి రెండు రోజులు టికెట్ రేట్స్ పెంచుకోవచ్చని తేల్చి చెప్పింది. అలాగే మూడో రోజు బుక్ అయిన టికెట్స్ కాకుండా థియేటర్స్ దగ్గర ఇచ్చే టికెట్స్ మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే ఇవ్వాలని సూచించింది. అప్పట్నుంచి టికెట్ రేట్స్ పెంచుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో పవన్ అభిమానులతో పాటు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పండగ చేసుకుంటున్నారు.

వకీల్ సాబ్ సినిమా విడుదలకు ముందు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్‌లో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. పవన్ సినిమాను కావాలని ప్రభుత్వం అడ్డుకుంటోందని జనసేన బీజేపీ నేతలు ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని అందుకే ఈ సినిమాపై సాధిస్తోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాపై వైసీపీ నాయకులు కూడా నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా టికెట్స్ రేట్స్ పెంపుపై రచ్చ జరుగుతుంది. సామాన్యుల కడుపులు కొట్టేలా టికెట్ రేట్స్ పెంచాల్సిన అవసరం ఏంటి అంటూ మంత్రి పేర్ని నాని బిజెపి నేతలకు కౌంటర్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ యాక్ట్‌ ప్రకారం రోజూ 4 షోలకే అనుమతి ఉందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ‘మీకు దురద ఉందని, మోజు ఉందని తెల్లవారుజామున 5 గంటలకు వెళ్తే షో వెయ్యరు సునీల్ గారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే సినిమా టిక్కెట్లకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమానులు ఏపీ హైకోర్టు‌ను ఆశ్రయించారు. తమకు మొదటి మూడు రోజులు టికెట్ రేట్స్ పెంచుకునే వెసలుబాటు కల్పించాలని వాళ్లు కోర్టును కోరారు. దానికి వాళ్లకు కోర్టు నుంచి కూడా సానుకూలంగా తీర్పు వచ్చింది. మొదటి మూడు రోజుల పాటు టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చంటూ సింగిల్ జడ్జ్ తీర్పు ఇచ్చారు. ఏపీలోని 13 జిల్లాల జాయింట్ కలెక్టర్స్‌కు, అలాగే ఏపీ ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇచ్చారు.

అయితే దీనిపై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం హౌజ్ మోషన్ కమిటీ హై కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై ఇప్పుడు హై కోర్టు కీలక తీర్పును వెలువరిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement