తన అరెస్ట్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ అంశంపై జిల్లా కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. నేరుగా హైకోర్టును కాకుండా కింద కోర్టును సంప్రదించాలని హైకోర్టు సూచించింది. సీఐడీ కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేయాలని పేర్కొంది. రఘురామ బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది.
రఘురామను నిన్న హైదరాబాదులో ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో రఘురాజు బెయిల్ పిటిషన్ వేశారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రఘురాజు తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు కోర్టులో వాదనలు వినిపించారు.
ప్రాథమిక విచారణ కూడా జరపకుండానే లోక్ సభ సభ్యుడు రఘురాజును అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. రఘురాజు అరెస్టుకు సంబంధించి సహేతుక కారణాలు కూడా లేవని వాదించారు. ఎటువంటి కారణాలు చూపకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొన్నారు. వాదనలు విన్న తర్వాత బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు తిరస్కరించింది.
కాగా, ఏపీ ప్రభుత్వంతోపాటు సీఎం జగన్, ప్రభుత్వ పెద్దలపైనా వరుసగా విమర్శల చేస్తున్న నేపధ్యంలో ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. మంగళగిరి సీఐడీ పీఎస్‌లో 124ఏ,153ఏ, రెడ్‌విత్ 120బి, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రఘురామకృష్ణరాజుతోపాటు మరో రెండు మీడియా సంస్థలపై కూడా కేసులు నమోదయ్యాయి.