ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత దృష్ట్యా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరోనా వ్యాక్సిన్లు అందిస్తున్న భారత్ బయోటెక్, సీరం సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. చెరో 4.08 కోట్ల డోసుల వ్యాక్సిన్లు సరఫరా చేయాలని ప్రభుత్వం ఆ సంస్థలను కోరింది. కరోనా వ్యాక్సిన్ల బిల్లులు త్వరగానే చెల్లిస్తామని సర్కారు స్పష్టం చేసింది. రాష్ట్ర అవసరాలకు సరిపడా డోసులను రాష్ట్రానికి అమ్మాలని భారత్ బయోటెక్, సీరం సంస్థలకు విజ్ఞప్తి చేసింది. కేంద్రం నిర్దేశించిన ధరకే వ్యాక్సిన్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 2.4 కోట్ల మందికి రెండేసి డోసుల చొప్పున వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించిన మేరకు.. ఆయా సంస్థలకు లేఖ రాసింది.
కాగా, రాష్ట్ర అవసరాలు తీర్చే విధంగా మరిన్ని కోవిడ్ వాక్సిన్ డోస్‌లతో పాటు, రెమిడిసివిర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లాతో పాటు, హెటెరో డ్రగ్స్ ఎండీ బి.పార్థసారథిరెడ్డితో ఫోన్ లో సీఎం జగన్ కోరిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 18–45 ఏళ్ల వయస్సు మధ్య వారందరికీ ఉచితంగా కోవిడ్ వాక్సిన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు అవసరమైనన్ని డోస్ లకు ఆర్డర్ పెట్టండి. 18–45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారిలో 2,04,70,364 మందికి వాక్సిన్ వేయాల్సి ఉన్నందున ఆ మేరకు డోస్‌లు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.