Thursday, November 21, 2024

గ్రామ వాలంటీర్లకు సత్కారం

ఏపీ వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లుగా పనిచేస్తోన్న వారికి ఇకపై సముచిత రీతిలో ప్రోత్సాహకాలు, పురస్కారాలు అందజేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ ఏడాది ఉగాది పండుగ రోజునే వాలంటీర్లను సత్కరించే కార్యక్రమానికి కార్యాచరణ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. వాలంటీర్ల సేవలను గుర్తించేలా ప్రోత్సాహకాలతో వారిని గౌరవించాలని, ఇప్పటికే మెరుగైన సేవలు అందిస్తోన్న వారిని.. సేవారత్న, సేవామిత్ర లాంటి పేర్లతో సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఉగాది పర్వదినాన ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వలంటీర్లను సత్కరించాలని  ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పేరిట మూడు కేటగిరీలుగా వార్డు, గ్రామ వార్డు వలంటీర్లను వైసీపీ ప్రభుత్వం సత్కరించనుంది. సేవా వజ్రకు రూ.30 వేల నగదు, సేవా రత్నకు రూ.20 వేలు, సేవా మిత్రకు రూ.10 వేల నగదు పురస్కారాన్ని అందించి, శాలువాతో సత్కరించనుంది. సత్కారానికి నవరత్నాల అమలులో చూపిన చొరవ, కోవిడ్, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో అందించిన సేవలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. ఏప్రిల్ 13న వార్డు, గ్రామ వలంటీర్లను సత్కరించే కార్యక్రమం నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రభుత్వం తీసుకొచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు వీరిని తీసుకొచ్చారు. వారికి నెలకు రూ.5వేల గౌరవ వేతనం ఇస్తున్నారు. ఒక్కొక్కరికి 50 కుటుంబాలను కేటాయించారు. ఆ 50 కుటుంబాలకు ప్రభుత్వం నుంచి లభించే పథకాలను చేరవేస్తారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ పెద్ద ఎత్తున మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా కరోనా వైరస్ సమయంలో గ్రామాలు, పట్టణాల్లో కొత్తగా ఎవరు వస్తున్నారు, వారి ఆరోగ్య పరిస్థితులు ఏంటి? ఒకవేళ కరోనా వస్తే వారిని ఆస్పత్రికి తరలించేందుకు సాయం చేయడం ద్వారా గ్రామ, వార్డు వాలంటీర్ల పేరు ప్రముఖంగా వినిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement