Friday, November 22, 2024

కరోనా వ్యాక్సినేషన్‌పై ఏపీ సర్కారు టార్గెట్

సెకండ్ వేవ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించగా.. ఏపీ ప్రభుత్వం తమ రాష్ట్రంలో 4 వారాల్లో కోటి మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

అయితే ప్రభుత్వ నిర్ణయం ప్రకారం వారానికి 25 లక్షల వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రోజుకు 3.57 లక్షల వ్యాక్సిన్లు ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ మేరకు ప్రజలు ముందుకు వస్తారా అన్నది అధికారుల ముందు ఉన్న పెద్ద ప్రశ్న. దీంతో అధికారులకు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌పై ప్రచారం కల్పించాల్సిన బాధ్యత ఉంది. మార్చి 26వ తేదీ వరకు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం ఏపీ వ్యాప్తంగా 20.96 లక్షల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అంటే రోజుకు 1.41 లక్షల వ్యాక్సిన్లు మాత్రమే ఇస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి రెట్టింపు వ్యాక్సిన్లు ఇస్తేనే ఏపీ ప్రభుత్వం టార్గెట్ పూర్తి చేసే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటికే గత వారం ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement