Saturday, November 23, 2024

ప్రధాని మోదీకి జగన్ లేఖ

ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియకు సహాకరించాలని కోరారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లు పూర్తిగా వినియోగించబడలేదని.. ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా కేంద్రం పాలసీ ప్రకారం 25 శాతం టీకాలను ప్రైవేట్‌ ఆస్పత్రులకు కేటాయించారు. అయితే, ఇందులో చాలా వ్యాక్సిన్లు మిగిలిపోయాయని సీఎం ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

జులై లో ఆంధ్రప్రదేశ్ లోని ప్రైవేటు ఆసుపత్రులకు 17,71,580 కరోనా వ్యాక్సిన్లు కేటాయించారని వెల్లడించారు. కానీ ఏపీలో ఇప్పటివరకు ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా 2,67,075 మంది మాత్రమే వ్యాక్సిన్లు తీసుకున్నారని సీఎం జగన్ వివరించారు. దీన్నిబట్టి ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ కు ఏమంత డిమాండ్ లేదన్న విషయం స్పష్టమవుతోందని, ఈ నేపథ్యంలో, ప్రైవేటు ఆసుపత్రులు వినియోగించని కరోనా వ్యాక్సిన్లను రాష్ట్రాల వ్యాక్సినేషన్ డ్రైవ్ లకు కేటాయించాలని సిఫారసు చేశారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం అయ్యేందుకు ఈ చర్య ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. కేంద్రం గనుక ఈ నిర్ణయం తీసుకుంటే ఇది కచ్చితంగా ఎంతో ప్రజాదరణ పొందుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు. మిగిలిపోయిన వ్యాక్సిన్లను ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌కు కేటాయించాలని కోరారు.

దేశంలో కరోనా నియంత్రణకు గానూ కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర సర్కార్ వివిధ ఔషధ కంపెనీల నుంచి వ్యాక్సిన్లను కొనుగోలు చేసి అయా రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది. ఇదే క్రమంలో జులై నెలలో ఏపీలోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు 17,71,580 డోసులు కేటాయించింది. అయితే, ఇందులో ఇప్పటి వరకు 2.67లక్షల మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లను ప్రైవేట్‌ ఆస్పత్రులు వినియోగించుకునే అవకాశం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement