Friday, November 22, 2024

క్వారీలో పేలుడు ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

కడప జిల్లాలోని మామిళ్ళపల్లె శివారులో ముగ్గురాయి క్వారీలో జరిగిన పేలుడు ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటన జరగటానికి గల కారణాలను జగన్ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మరోవైపు ఈ ఘటనపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సీఎం సొంత జిల్లాలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం బాధాకరమని అన్నారు. ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

కాగా, కడప జిల్లా కలసపాడు మండలం, మామిళ్లపల్లె వద్ద ఉన్న ముగ్గురాయి క్వారీలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. పేలుడు జరిగిన సమయంలో క్వారీలో 20 మందికి పైగా కార్మికులున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. ఇప్పటివరకు ఏడుగురు మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం. ప్రస్తుతం క్వారీ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్వారీకి జిలెటిన్ స్టిక్స్ తరలిస్తుండగా ప్రమాదవ శాత్తూ పేలినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement