రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,01,058 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. నేటి నుంచి ఈ నెల 24 వరకు జరిగే పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమై 12 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్షకు అనుమతించబోమని హెచ్చరించారు. అలాగే, పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించరు. జిల్లాకు ఐదు చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. అలాగే, అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
కాగా, పదో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా నెలకొన్న ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు జాగ్రత్తలు చేపట్టారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లోనూ, బయట సీసీ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాల ద్వారా పరీక్షల తీరుతెన్నులను రికార్డు చేయడంతోపాటు వాటన్నింటినీ ఇంటర్ బోర్డు కార్యాలయానికి అనుసంధానించారు. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా బోర్డు అధికారులు పరీక్షలు జరుగుతున్న తీరును నిత్యం పరిశీలిస్తారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలు ఇంటర్ పరీక్షలను పర్యవేక్షించనున్నాయి. ఆయా జిల్లాల ఎస్పీలు ఇప్పటికే పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరోవైపు తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభం అయ్యాయి. ఈ నెల 24వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. సుమారు 9 లక్షలకు పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక వసతులు కల్పించారు. పరీక్షల కోసం 1,443 కేంద్రాలు సిద్ధం చేశారు. వీటిలో 26 సెల్ఫ్ సెంటర్లు ఉండగా.. 386 ప్రభుత్వ, 206 గురుకులాలు, 840 ప్రైవేట్ కాలేజీలు, 11 ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 9,07,393 విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.