Tuesday, November 26, 2024

ఇంటి పున‌ర్నిర్మాణంలో బ‌య‌ట‌ప‌డిన – రూ.1.25కోట్ల విలువైన 86బంగారు నాణేలు

శిథిల‌మైన నివాసంలో రూ.1.25కోట్ల విలువైన 86బంగారు నాణేలు కార్మికుల కంట ప‌డ్డాయి. ఈ సంఘ‌ట‌న మధ్యప్రదేశ్‌లోని ధర్ జిల్లాలో వెలుగు చూసింది. అదనపు ఎస్పీ దేవేంద్ర పాటిదార్ వివరాల ప్రకారం, ధర్ జిల్లాలో ఓ పాడుబడ్డ ఇంటిని పునర్నిర్మించాలని ఆ ఇంటి యజమాని భావించాడు. ఇందులో భాగంగా చెల్లాచెదురుగా పడి ఉన్న శిథిలాలను తొలగించడానికి ఎనిమిది మంది కార్మికులను పనికి మాట్లాడాడు. వారు ఆ ఇంటిలో చెత్తను తీసివేస్తుండగా పురాతనమైన 86 బంగారు నాణేలు లభించాయి. వాటిని చూడగానే వారి కళ్లు మెరిసిపోయాయి. ఈ నిధుల గురించి బయట ఎవరికీ చెప్పకుండా వారిలో వారు పంచుకోవాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే కొన్ని రోజులపాటు ఆ విషయం బయట ఎవరికీ తెలియలేదు.

అయితే, ఆ ఎనిమిది మందిలో ఒక కార్మికుడు మద్యపానం సేవించి మత్తులో ఈ బంగారు నాణేల గురించి బయట వాగాడు. తాను ఓ నాణేన్ని రూ. 56 వేలకు అమ్మేశానని గొప్పలకు పోయాడు. తద్వార ఇంటి ఖర్చులన్నీ తీర్చుకుని సెకండ్ హ్యాండ్‌లో ఓ ఫోన్ కొనుక్కున్నానని వివరించాడు. కానీ, తాను తాగిన మత్తులో మాట్లాడిన విషయం పోలీసుల వ‌ర‌కు వెళ్లుతుందని అప్పుడు ఆ లేబర్ అనుకోలేదు. ఈ విషయం తెలియగానే వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కార్మికులను అరెస్టు చేశారు. వారి నుంచి ఇప్పటి వరకు 86 బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ బంగారు నాణేల గురించి ఇంటి యజమానికి తెలియదు. తన పురాతన ఇంటిలో నాణేలు దాగి ఉన్నాయనే విషయం ఆయనకి తెలియ‌లేదు. స్వాధీనం చేసుకున్న ఆ బంగారు వస్తువుల మార్కెట్ విలువ సుమారు రూ. 60 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. ఇవి పురాతనమైనవి కాబట్టి, ఆర్కియలాజికల్ విలువ సుమారు రూ. 1.25 కోట్లు పలుకుతుందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement