పొరుగుదేశంపై దమనకాండ సరికాదంటూ రష్యా గడ్డపైనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్ పై దురాక్రమణకు దిగిన అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు నిరసనలు తెలపాలంటే విపక్ష నేత అలెక్సీ నావల్నీ పిలుపునిచ్చిన మేరకు మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ నగరాల్లో యుద్ధ వ్యతిరేకులు భారీగా వీధుల్లోకి వచ్చారు. సెయింట్ పీటర్స్ బర్గ్ నగరం పుతిన్ సొంతగడ్డ. అలాంటి చోటే ఆయన పట్ల వ్యతిరేకత వ్యక్తం కావడంతో పోలీసులు భారీగా లాఠీచార్జి చేసి నిరసనకారులను చెదరగొట్టారు. అటు మాస్కోలోనూ అనేకమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు, నావల్నీ ప్రజలకు పిలుపునిచ్చే సమయంలో కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రష్యా ఎప్పటికీ పొరుగుదేశాలను చూసి భయపడే దేశం కారాదన్నారు. పుతిన్ ఒక చిన్న పిచ్చి జార్ చక్రవర్తి అని అభివర్ణించారు. ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణను రష్యా వ్యాప్తంగా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. పెద్ద నగరాల్లోనే కాకుండా, రష్యాలోని అనేక పట్టణాల్లోనూ నిరసనలు వ్యక్తం కాగా, దాదాపు 7 వేల మందిని అరెస్ట్ చేసినట్టు సమాచారం.
Advertisement
తాజా వార్తలు
Advertisement