హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: భారత రాష్ట్ర సమితి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల్లో అసమ్మతిరాగాలు చోటుచేసుకుంటున్నాయి. నియోజక వర్గంలో అందరినీ సమన్వయపరిచి వచ్చే అసెంబ్లిd ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలన్న పార్టీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆయా నియోజకవర్గాల్లో నేతలు బాహాబాహికి దిగడంపై అధినాయకత్వం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఆయా నియోజకవర్గాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనాల్లో అసమ్మతి నేతలు తమ గళం వినిపించారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య , మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని ఆహ్వానించకపోవడంపై ఆయన తనకు జరిగిన అవమానానికి మీడియా సమావేశం నిర్వహించి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
వికారాబాద్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ నాయ కత్వంపై భారాస నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఎమ్మెల్యే వ్యవహార శైలితో విసుగుచెందిన నేతలు రహస్య ప్రదేశంలో సమావేశమై ఆనంద్‌కు వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయించారు. నామినేటెడ్ పదవులను ఎమ్మెల్యే ఆనంద్ అమ్ముకుంటున్నారని, పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఆనంద్‌ను ఓడించడానికి ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేయాలని అసమ్మతి నేతలు నిర్ణయించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ అసెంబ్లిd నియోజకవర్గంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న భారాస సీనియర్ నేత, ఉద్యమకారుడు శ్రీహరిరావు తన అస ంతృప్తిని వ్యక్తం చేశారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నియోజకవర్గాన్ని గాలికొదిలేశారని, దీంతో పార్టీ మూడోస్థాయికి దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మీయతలేని సమ్మేళనాలు ఎందుకు అని ఆయన నిలదీశారు. ఎన్నికల ముందు సమ్మేళనాలు నిర్వహించడం, అవి అయిపోయాక నాయకులను, కార్యకర్తలను విస్మరిం చడం పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లిd ఎన్నికల్లో పార్టీ అధినాయకత్వం స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే తిరిగి టికెట్ వస్తుందని, ఈ నియోజకవర్గంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా సీపీఐఎం అభ్యర్థిని పోటీకి పెట్టేది లేదని తెగేసి చెప్పారు. సీఎం కేసీఆర్ ఉపేందర్‌రెడ్డి అభ్యర్ధిత్వాన్ని ఇప్పటికే ఖరారు చేశారని, పార్టీ శ్రేణులంతా ఆయనకు అండగా నిలిచి పనిచేయాలని కోరారు.
నియోజకవర్గంలో జరిగే ఏ సమావేశాలకూ పిలవడం లేదు..: కడియం
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో జరిగే ఎలాంటి సమావేశాలకు తనను ఆహ్వానించడం లేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. భారాస ఆత్మీయ సమ్మేళనాలకు తనకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని వాపోయారు. భారాస నేతలు ఎన్నికలప్పుడు వస్తున్నా రని, ఆర్థికసాయం చేస్తున్నానని, ఆ తర్వాత ఎటువంటి కార్యక్రమాలకు పిలవడం లేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలను కూడా స్థానిక నాయకత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. తాను ఆత్మీయ సమ్మేళనాలకు ఎందుకు రావడం లేదని పార్టీ కార్యకర్తలు, నాయకులు అడుగుతున్నా రని, వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని పేర్కొన్నారు. తనపై ఎన్ని విమర్శలు చేసినా, గత ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే రాజయ్య గెలుపుకు కృషి చేశానని, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ నిస్వార్థంగా సేవలందిం చారని తెలిపారు. ఏ ప్రభుత్వకార్యక్రమాలకూ తనకు ఆహ్వానం అందడం లేదని చెప్పారు.
కడియం శ్రీహరి ఆరోపణలకు ఎమ్మెల్యే రాజయ్య స్పందించారు. ఈ నెల 4న జరిగే స్టేషన్ ఘన్‌పూర్ క్లస్టర్ -1 సమావేశానికి కడియం శ్రీహరికి ఆహ్వానం ప ంపానని చెప్పారు. నల్గొండ జిల్లాలో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీహరిని పార్టీ అధినాయకత్వం ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందున ఆయనను నియోజకవర్గంలో జరిగే సమావేశాలకు ఆహ్వానించలేదని పేర్కొన్నారు.
కాగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ అసెంబ్లి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు గ్రూప్‌లుగా ఏర్పడి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న వైనాన్ని పార్టీ అధినాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. కొన్నాళ్లుగా ఎమ్మెల్యేల పర్యటనలకు దూరంగా ఉంటున్నవారు ఆత్మీయ సమ్మేళనాలకు గైర్హాజరవుతున్నట్లు తెలుస్తోంది. మెదక్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి ఒక గ్రూప్‌గా , సీఎం కేసీఆర్ రాజకీయకార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మరో గ్రూప్‌గా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో కొందరు అటు వైపు, మరికొందరు ఇటు వైపు అంటున్నట్లు ఉంటున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు తనయుడు మైనంపల్లి రోహిత్ రంగప్రవేశంతో మెదక్ నియోజకవర్గంలో మూడోవర్గం తయారైంది. నిజాంపేట మండల కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి భారాస జడ్పీటీసీ సభ్యుడు విజయ్ కుమార్ దూరంగా ఉండిపోయారు. ఇలా ఆయాఅసెంబ్లి నియోజకవర్గాలు, మండలాల్లో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల్లో అసమ్మతి రాగాలు చోటుచేసుకుంటుండడాన్ని పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీ. రామారావు తీవ్రంగా పరిగణిస్తూ ఆయా నియోజకవర్గం నుంచి నివేదికలు తెప్పించుకుని అధ్యయనం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.