ఏడాదిన్నరలోనే మారిన కుటుంబ వ్యథా చిత్రం
– ఇటు అతుకుల బొంతలు
– అటు సంపద మేటలు –
పేదలు మరింత పేదరికంలోకి.. పుస్తెలమ్మి రోజులు గడుపుకుంటున్న
దైన్యం మధ్యతరగతి నుంచి దారిద్య్ర – రేఖ దిగువకు జారిపడిన సగటు -భారతీయుడు మరోవైపు సంపన్నులు
రాత్రికి రాత్రే అపర కుబేరులుగా.. ఐటీ దాడుల్లో బయటపడుతున్ననగదు కట్టలు.. టన్నుల కొద్దీ బంగారం
నిల్వలు నానాటికీ పెరిగిపోతున్న అంతరం భారత దేశంలోనే ఈ వైపరీత్యమని నిపుణుల విశ్లేషణ
ప్రపంచ దేశాల్లో చైనా కంటే కూడా భారత్
వృద్ధి రేటు ముందంజలో ఉంది. ఇక్కడ ఉత్పత్తి అనూహ్యంగా పెరుగుతోంది. మార్కెట్లు విస్తరించాయి. సంపద మేటలేస్తోంది. అయితే ఇవన్నీ దేశంలో కొన్ని కుటుంబాలకే పరిమితమౌతున్నాయి. కొన్నివర్గాలకే అందుబాటులోకి వస్తున్నాయి. పెరిగిన సంపద పంపిణీలో తీవ్రమైన అసమానతలు చోటు చేసుకుంటున్నాయి. ఈ దేశంలో ధనికులు, పేదల మధ్య అంతరం అనూహ్యంగా పెరుగుతోంది. దీన్ని తగ్గించే ప్రయత్నాలు ఏమాత్రం సఫలం కావడం లేదు. ప్రభుత్వాలు కూడా ఓ వర్గం వారికే వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ ఫలితాల దుష్పరిణామాలు ఇప్పటికే దేశంపై ప్రభావం చూపిస్తున్నాయి.
(న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి):భారతదేశం పుస్తెలమ్ముకుంటోంది. భారతీయ మహిళలు తమ పుట్టింటి సారెగానే లభించిన చిన్న చిన్న బంగారు వస్తువుల్ని కూడా బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. చెవి కమ్మలు, ముక్కు పుడకలు, ఆఖరకు మంగళసూత్రాల్ని కూడా అమ్ముకుంటేనే గాని వారికి రోజుగడవని దుస్థితేర్పడింది. దేశంలోకి కోవిడ్ ప్రవేశించిన అనంతరం అప్పటి వరకు మధ్యతరగతిగా పరిగణించబడ్డ కుటుంబా ల్లో 26కోట్ల మంది ఈ ఏడాదిన్నరలోనూ దారిద్య్రరేఖ దిగువకు దిగజారిపోయారు. వీరంతా ఉపాధి కోల్పోయారు. అప్పటివరకు చేస్తున్న ఉద్యోగాల్నుంచి తొలగించబడ్డారు. వ్యాపారాలు సాగలేదు. అప్పులపాలయ్యారు. రోజువారి గడవడం కూడా కష్టమైంది. రెండుపూట్లా పెళ్ళం, బిడ్డలకు తిండిపెట్టలేని దుస్థితికి దిగజారారు. అప్పటివరకు అధ్యాపకులుగా.. ప్రైవేటు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగుల ుగా పని చేసిన వీరంతా ఆకస్మాత్తుగా రోడ్డున పడ్డారు. కూరగాయలు, పళ్ళు, పూలు, తినుబండారాల వ్యాపారాలు పెట్టుకునే స్థాయికి పడిపో యారు. కొందరైతే రోజువారి ఉపాధి హామీ కూలీలుగా మారారు. అంతవరకు ఇంటినుంచి బయటకురాని మహిళలు కూడా కూలిపను ల వైపు కాళ్ళు కదిపారు. ఇంకొందరు కోవిడ్ సమయంలో ఆసుపత్రుల కవసరమైన అదనపు సిబ్బందిగా మారారు. ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి కోవిడ్ రోగులకు సహాయకులుగా పని చేశారు. పిల్లల ఫీజులు కట్టలేక, సరైన తిండిసౌకర్యంలేక ఈకుటుంబాలన్నీ అలమటిస్తున్నాయి. అద్దెలు కట్టలేక ఇబ్బందులపాలౌతున్నారు. పాత బకాయిలు చెల్లించక పోవడంతో ఇళ్ళు ఖాళీచేసేందుకు యజమానులు ఒప్పుకోవడంలేదు. అలాగే పలువురి దుకాణాల్లో వ్యాపారాలు పడిపోయాయి. రోజువారి రాబడి తగ్గిపోయింది. రోజస్తమాను ఎదురుచూసినా రోజుకు 50రూపాయలు కూడా గిట్టుబాటు కాని దుస్థితేర్పడింది. అలాగని దుకాణం సర్దేసి ఖాళీ చేసేందుకు అవకాశాలుకొరవడ్డాయి. పాత బకాయిల పేరిట యజమానులు వీరి పిలక పుచ్చుకుంటున్నారు. మొత్తం చెల్లింపులు పూర్తయితే తప్ప దుకాణం మూతకు వీరంగీకరించడంలేదు. ఈ దుస్థితిలో వీరిళ్ళలోని మహిళలు తమకున్న కొద్దిపాటి బంగారాన్ని మార్కెట్లో విక్రయించగా వచ్చిన సొమ్ముతో పాత అప్పులు తీరుస్తున్నారు. కొందరు ఇళ్ళకు అద్దెలు కడుతున్నారు. మరికొందరు ఆహార దినుసులు కొనుగోలు చేస్తున్నారు. ఇలా.. ఎప్పుడో పాతికేళ్ళ క్రితం పెళ్ళయిన సమయంలో తల్లిదండ్రులు తమ కట్నకానుకల్లో భాగంగా చేయించి ఇచ్చిన చిన్న చిన్న గొలుసులు, కమ్మలు, ముక్కుపుడకలు, లాకెట్లు, వంకీలు, చెంపచెవరాలు, వంటివన్నీ ఇప్పుడు వరుసగా బంగారం వ్యాపారులవద్దకు చేరిపోతున్నాయి. గతకొన్ని రోజులుగా ముంబయ్‌లోని చిన్న చిన్న బంగారు వర్తకులకు ఇదే ప్రధాన వ్యాపకంగా మారింది. ఈ పరిస్థితిప్పుడు దేశమంతా ఉంది.
దేశంలో సగానికి పైగా జనాభా వాస్తవ దుస్థితికిది అద్దంపడుతోంది. అయితే నాణానికి రెండో వైపు పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అధికారులు, రాజకీయవేత్తల ఇళ్ళపై ఆదాయపన్ను శాఖ, నిఘా వర్గాలు దాడులు చేస్తే ఇనుప బీరువాల్తో పాటు గోడల్లో కూడా దాచి ఉంచిన కట్టలకు కట్టల నగదు బట్టబయలౌతోంది. టన్నులకొద్దీ బంగారు నిల్వలు వెలుగుచూస్తున్నాయి. మరోవైపు దేశంలో స్థూల జాతీయ ఉత్పత్తి వేగంగా వృద్ది చెందుతోంది. ఈ ఆర్ధిక సంవత్సరం తొలిత్రైమాసికంలో జిడివి వృద్దిరేటు 8.1శాతం నమోదుకాగా మొత్తం ఏడాది సగటు కనీసం 8శాతం ఉంటుందని ప్రపంచ స్థాయి ఆర్ధిక నిపుణులు అంచనాలేస్తున్నారు. కరోనా ప్రభావం అనంతరం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల ఆర్ధిక వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోనేలేదు. అమెరికా వంటి అగ్రరాజ్యం కూడా జిడిపి వృద్ది రేటు 3శాతం లోపే ఉంటుందని అంచనాలేస్తోంది. వివిధ రంగాల్లో సమగ్రాభివృద్ది సాధించిన జపాన్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ వంటి దేశాలు కూడా గరిష్టంగా 2.5నుంచి 3శాతం జిడిపి వృద్ది నమోదౌతుందని అంచనాలేస్తున్నారు. ఒక్క చైనా మాత్రమే 4శాతానికి పైబడి ఈ ఏడాది స్థూల ఉత్పత్తిలో వృద్ది నమోదు చేయగలమని భావిస్తోంది. అమెరికా వంటి దేశం క ూడా 1.2శాతం లోపే జిడిపి వృద్ది ఉంటుందని అంచనాకు వచ్చింది. ప్రపంచ దేశాల్లో చైనా కంటే కూడా భారత్ వృద్ది రేటు ముందంజలో ఉంది. ఇక్కడ ఉత్పత్తి అనూహ్యంగా పెరుగుతోంది. మార్కెట్లు విస్తరించాయి. సంపద మేటలేస్తోంది. అయితే ఇవన్నీ దేశంలో కొన్ని కుటుంబాలకే పరిమితమౌతున్నాయి. కొన్నివర్గాలకే అందుబాటులోకొస్తున్నాయి. పెరిగిన సంపద పంపిణీలో తీవ్రమైన అసమానతలు చోటు చేసుకుంటున్నాయి. ఈ దేశంలో ధనికులు, పేదల మధ్య అంతరం అనూహ్యంగా పెరుగుతోంది. దీన్ని తగ్గించే ప్రయత్నాలు ఏమాత్రం సఫలంకావడంలేదు. ప్రభుత్వాలు కూడా ఓ వర్గం వారికే వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ ఫలితాల దుష్పరిణామాలు ఇప్పటికే దేశంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఓ వైపు భారత్‌లో బిలియనీర్లు, సంపన్నుల సంఖ్య పెరుగుతోంది. కోవిడ్ అనంతరం కొత్తగా 128మంది బిలియనీర్లయ్యారు. 3,671మంది సంపద 300శాతానికిపైగా పెరిగింది. దేశంలో 13మంది సంపద 1100శాతానికిపైగా వృద్ది చెందింది. అదే సమయంలో 27కోట్ల మంది మధ్యతరగతి నుంచి దిగువ పేద కుటుంబీకులుగా మారిపోయారు. పేదలు మరింతగా దిగజారిపోయారు. ప్రపంచంలోనే మరే దేశంలోనూ లేని పేద, సంపన్నుల మధ్య అంతరం భారత్‌లో అనూహ్యంగా పెరిగింది. దీన్ని సర్దుబాటు చేయలేని పక్షంలో రెండువర్గాల మధ్య వివాదాలు జరిగే అవకాశముంది. ఇది దేశంలో అంతర్యుద్దానికి దారితీసే ప్రమాదం లేకపోలేదని నిపుణులు పే ర్కొంటున్నారు.
2050నాటికి భారత్ ప్రపంచంలోనే రెండవ శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్థగా అభివృద్ది చెందుతుంది. అప్పటికే చైనా మొదటి స్థానంలోకొస్తుంది. రెండో స్థానంలో ఉన్న అమెరికాను వెనక్కి నెట్టి ఆ సంవత్సరంలో భారత్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంటుందంటూ ప్రైస్ వాటర్ హౌస్ హూపర్స్ అనే ఆర్ధిక విశ్లేషణ సంస్థ తన నివేదికలో ప్రకటించింది. భారత్‌లో కొనుగోలు శక్తి అనూహ్యంగా పెరుగుతోంది. భారత్‌తో పాటు బ్రెజిల్, చైనా, ఇండోనేషియా, మెక్సికో, రష్యా, టర్కీ దేశాలు స్థూల జాతీయోత్పత్తిలో 3.5నుంచి 4శాతానికి పైగా వార్షిక వృద్ది నమోదు చేస్తాయని ఈ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థలుగా ఉన్న అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఇటలీ, జపాన్, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, తదితర దేశాల సగటు వార్షిక వృద్ది 1నుంచి 1.6శాతానికి పరిమితమౌతుంది. ఇప్పుడు అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థలుగా ఉన్న జి 7దేశాల స్థూల ఉత్పత్తి విలువ 20శాతానికి పరిమితమైతే ప్రస్తుతం అభివృద్ది చెందుతున్న జాబితాలో ఉన్న దేశాల స్థూల జాతీయ ఉత్పత్తి 2030నాటికి 50శాతానికిపైగా పెరుగుతుంది. అయితే భారత్కొచ్చేసరికి సంపద పెరిగినా అంతర్గత ఆర్ధిక అంతరాలు మరింతగా పెరిగే ప్రమాదాన్ని ఈ సంస్థ శంకించింది. 2004లో భారత్‌లో 12మంది బిలియనీర్లుం డేవారు. 2012నాటికి వీరి సంఖ్య 46కి పెరిగింది. 2017లో 101కి చేరింది. 2020నాటికి 186కి చేరుకుంది. దేశంలోని మొత్తం సంపదలో 73శాతం ఈ దేశ జనాభాలో 1శాతం మాత్రమే ఉన్న సంపన్నుల వద్దే ఉంది. మొత్తం సంపదలో 1శాతం ఈ దేశంలోని 67కోట్ల మంది పంచుకుంటున్నారు. ఇది దేశంలోని సంపన్న, పేదల మధ్య నెలకొన్న ఆర్ధిక అంతరాలను స్పష్టం చేస్తోంది. దేశంలో కొందరు సంపన్నులు రాత్రికి రాత్రే మరింత సంపద పోగేస్తున్నారు. కుబేరులు అపర కుబేరులౌతున్నారు. పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నారు. 2020లో ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ విస్తరించింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థల్ని అతలాకులతం చేసింది. అమెరికా నుంచి అఎn్గానిస్థాన్ వరకు దీని ప్రభావంతో బెంబేలెత్తిపోయాయి. ఆ పరిస్థితుల్లో కూడా భారత్‌లో ప్రతి రెండ్రోజులకు కొత్తగా ఓ బిలియనీర్ పుట్టుకొచ్చాడు. ఓ వైపు దేశంలో కార్మిక సం క్షోభమేర్పడింది. వలస కార్మికులు ఉపాధి కోల్పోయారు. వ్యవసాయరంగం కుదేలైంది. ఈరంగంలో ఉపాధి పరిస్థితులు కొరవడ్డాయి. ఇలాంటి నేపధ్యంలో కూడా దేశంలో ఆర్ధిక అంతరాలు వేగంగా విస్తరించాయి.