Saturday, November 23, 2024

పోలీసు సంక్షేమానికి మరో ముందడుగు.. రిటైర్​మెంట్​లోగా సొంతిళ్లు: డీజీపీ మహేందర్​రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దాదాపు లక్షకు పైగా అధికారులు, సిబ్బంది ఉన్న రాష్ట్ర పోలీస్‌శాఖ తమ అధికారులు, సిబ్బంది సంక్షేమం కోసం మరో ముందడుగు వేసింది. ఇప్పటికే ఆరోగ్య భద్రతా ఏర్పాటు ద్వారా పోలీసుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించిన పోలీస్‌ శాఖలోని ప్రతి అధికారి, సిబ్బంది తమ పదవీ విరమణలోగా కనీసం ఒక ఇంటిని లేదా ప్లnాట్‌ను కలిగి ఉండేలా తగు ఆర్థిక సహాయం అందించేందుకు వీలుగా తెలంగాణా స్టేట్‌ పోలీస్‌ వెల్ఫేర్‌ సొసైటీ అనే విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ సొసైటీ నిర్వహణా తీరు, దీని ద్వారా అందించే సంక్షేమ కార్యక్రమాలపై డీజీపీ మహేందర్‌రెడ్డి శుక్రవారం రాష్ట్రంలోని పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు, యూనిట్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అడిషనల్‌ డీజీలు ఉమేష్‌ షరాఫ్‌, జితేందర్‌ కూడా పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మాట్లాడుతూ, పోలీస్‌ అధికారుల సంక్షేమానికై సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని దీనిలో భాగంగానే తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఏర్పాటుకు అనుమతించడమే కాకుండా ఆదాయం పన్ను మినహాయింపు లభించేలా సహకరించారని పేర్కొన్నారు.

ప్రస్తుతం అమలులో ఉన్న ఆరోగ్య భద్రతా మాదిరిగానే పోలీసులకు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పించాలని సీఎంని కోరగా, ఇందుకోసం ప్రత్యేకంగా మూలధనాన్ని పెంపొందించుకునేందుకు పోలీస్‌శాఖ ఖాళీ స్థలాల్లో పెట్రోల్‌ పంపులు, ఫంక్షన్‌ హాళ్ల నిర్మాణానికై సీఎం అనుమతిచ్చారని తెలిపారు. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రత్యేకంగా తెలంగాణా స్టేట్‌ పోలీస్‌ వెల్ఫేర్‌ సొసైటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని ఈ సొసైటీకి స్వచ్ఛందంగా విరాళాలు అందించేవారికి, వివిధ కార్యక్రమాల ద్వారా పొందే ఆదాయానికి 80జీ, 12ఏ కింద ఆదాయం పన్ను మినహాయింపు లభించిందని డీజీపీ చెప్పారు. ఈ సొసైటీకి సమకూరే నిధుల నుండి పోలీసు అధికారులకు ఇల్లు లేదా ప్లాట్‌ల కొనుగోలుకు నామమాత్ర వడ్డీపై రుణాలను అందించనున్నట్టు వివరించారు.

రాష్ట్రంలో సీసీ టీవీల నిర్వహణకు ప్రత్యేక విభాగం
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏర్పాటు చేసిన దాదాపు 9 లక్షల సీసీ టీవీల నిర్వహణకు ప్రత్యేకంగా తెలంగాణ స్టేట్‌ సొసైటీ ఫర్‌ పబ్లిక్‌ సేప్టీ అనే సంస్థను ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యంతో పెద్దఎత్తున సీసీ టీవీలను ఏర్పాటు చేసినప్పటికి వాటి నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. దీన్ని అధిగమించడానికి అడిషనల్‌ డీజీ జితేందర్‌ ఆధ్వర్యంలో తెలంగాణా స్టేట్‌ సొసైటీ ఫర్‌ పబ్లిక్‌ సేప్టీ అనే సంస్థను ఏర్పాటు చేసి దీనిద్వారా సీసీటీవీ ప్రాజెక్ట్‌ నిర్వహణను నిరాటంకంగా కొనసాగిస్తామని వివరించారు. సీసీటీవీల నిర్వహణకై ప్రత్యేకంగా కామన్‌ సాప్ట్‌వేర్‌ రూపొందిస్తున్నామన్నారు. ఈ సొసైటీకి సీఎస్‌ఆర్‌ కిందగానీ , స్వచ్ఛందంగా గానీ అందచేసే నిధులకు ఆదాయ పన్ను మినహాయింపు లభించేలా ప్రయత్నిస్తున్నామని డీజీపీ తెలిపారు.

కొవిడ్‌ మృతుల పోలీస్‌ కుటుంబాల పిల్లలకు స్కాలర్‌ షిప్‌లను అందిందించిన డీజీపీ
కొవిడ్‌-19తో మరణించిన పోలీసు కుటుంబాల పిల్లలకు డీజీపీ మహేందర్‌రెడ్డి స్కాలర్‌షిప్‌లను అందచేశారు. కార్యక్రమంలో 25 మంది పాఠశాల, కళాశాల విద్యార్థులకు స్కాలర్షిప్‌లను అందజేశారు. సీఎస్‌ఆర్‌ పథకంలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కరోనా మృతుల పోలీసు కుటుంబాల పిల్లలకు రూ. 15 వేల నుండి 75 వేల వరకు అందించింది. ఈ కార్యక్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అధికారులు తరుణ్‌ చౌదరి, బద్రి విశాల్‌, జోస్‌ స్టీఫెన్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement