లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరొకరు బలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి హరికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. తూర్పుగోదావరి జిల్లా కడియంలోని భాస్కరనగర్‌లో నివాసముంటున్న హరికృష్ణ బీటెక్ చదువుతున్నాడు. అయితే అవసరం నిమిత్తం హరికృష్ణ ఈ ఏడాది జనవరిలో పెపీ అనే లోన్‌యాప్ ద్వారా కొంత రుణం తీసుకున్నాడు. టైమ్‌కు డబ్బులు చెల్లించినా కూడా ఇంకా నగదు చెల్లించాలని లోన్ యాప్ నిర్వాహకులు ఒత్తిడి తీసుకొచ్చారు.
లేకుంటే.. నగ్నఫొటోలు బంధువులు, స్నేహితులకు పంపుతామని బెదిరించారు. ఈ క్రమంలోనే మరో లోన్‌యాప్ అయిన పెట్టీ క్యాష్ అనే యాప్ ద్వారా హరికృష్ణ రుణం తీసుకున్నారు. ముందుగా లోన్ తీసుకున్న పెపీ లోన్‌యాప్‌కు చెల్లింపు చేశాడు. అయితే పెట్టీ క్యాష్ నుంచి హరికృష్ణ రూ.5 వేలు మాత్రమే తీసుకోగా.. రూ.21 వేలు వరకు చెల్లించాలంటూ మెసేజ్‌లు పంపారు. ఇందుకోసం మరిన్ని లోన్ యాప్‌ల నుంచి డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ మొత్తాలు చెల్లించినప్పటికీ.. నిర్వాహకుల నుంచి వేధింపులు ఆగలేదు. డబ్బు చెల్లించకుంటే కుటుంబ సభ్యులందరికీ, కాంటాక్ట్ నంబర్లకూ న్యూడ్ ఫొటోలు పంపుతామని బెదిరింపులకు దిగారు. దీంతో హరికృష్ణ ఆత్మహత్య చేసుకున్నారు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతోనే హరికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.