Saturday, November 23, 2024

ఎస్సీలకు మరో ఆప్షన్​.. ఆస్పత్రులకు డైట్‌ పంపిణీలో రిజర్వేషన్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రభుత్వాస్పత్రుల్లో రోగులు, వారి సహాయకులకు పౌష్టికాహారం సరఫరా చేసే ఏజెన్సీల నియామకంలో ఎస్సీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రిజర్వేషన్‌ను కల్పించింది. పౌష్టికాహార ఏజెన్సీల ఎంపికలో 16శాతం రిజర్వేషన్లను ఎస్సీలకు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌.ఏ.ఎం.రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉత్తర్వులతో ఇకమీదట ఆస్పత్రులకు పోషకాహారాన్ని అందించే ఏజెన్సీల ఎంపికలో ఆయా ఆసుపత్రుల సూపరిండెంట్‌లు ఎస్సీల యాజమాన్యంలోని ఏజెన్సీలకు 16 శాతం కచ్చితంగా కేటాయించాల్సి ఉంటుంది. 500 పడకల వరకు సామర్థ్యం ఉన్న దవాఖానలకు రిజర్వేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం వర్తింపజేసింది.

ఇందుకోసం ఆస్పత్రులను రెండు కేటగిరీలుగా విభజించింది. 100 వరకు బెడ్లు ఉన్న వాటిని ఏ కేటగిరి గా, 500 వరకు బెడ్లు ఉన్న హాస్పిటల్‌ లను బి కేటగిరిగా నిర్ధారించింది. ఏ హాస్పిటల్లో రిజర్వేషన్‌ కల్పించాలనేది డ్రా ద్వారా నిర్ధారిస్తారు. కనీస టర్నోవర్‌ ను 50 శాతం తగ్గించాలి. రిజర్వ్‌ డ్‌ ఆస్పత్రి కి ఒక్క బిడ్‌ వచ్చినా పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ ఒక్కటి రాకపోతే మరోసారి టెండర్‌ ఆహ్వానించాలి. అప్పుడు కూడా బిడ్లు రాకపోతే ఓపెన్‌ టెండర్లు పిలువాలని నిబంధనలు విధించారు. నిర్ణయించిన రిజర్వేషన్ల మేరకు ఎస్సీ ఎజెన్సీల ఎంపిక కోసం ప్రత్యేకంగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, రాష్ట్ర వైద్య విధానపరిషత్‌ కమిషనర్‌, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ సభ్యులుగా ఉంటారు. టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement