కేరళ రాష్ట్రంలో మరో మిస్టరీ వ్యాధి వెలుగులోకి వచ్చింది. చిన్నారులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఈ జబ్బును టమోటా ఫ్లూగా పేర్కొంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలో ఐదేళ్లలోపు వయసున్న 80 మంది చిన్నారుల్లో ఈ మిస్టీరియస్ వ్యాధిని గుర్తించారు. ఆ తర్వాత ఈ వ్యాధి వ్యాప్తి తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. అరుదైన వైరల్ వ్యాధి వ్యాప్తి కేరళ రాష్ట్రంతో పాటు తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా భయాందోళనలకు గురిచేస్తోంది.
తమిళనాడు-కేరళ సరిహద్దులోని వాలయార్ వద్ద జ్వరం, దద్దుర్లు, ఇతర అనారోగ్య సమస్యలతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కేరళ నుంచి కోయంబత్తూర్‌లోకి వచ్చే వారికి వైద్య బృందం పరీక్షలు నిర్వహిస్తోంది,
టొమాటో ఫ్లూ అంటే ఏమిటి?
టొమాటో ఫ్లూ యొక్క లక్షణాలు ఏమిటి? నివారణ చర్యలు ఏమిటి? అనే దానిపై ఇప్పుడు వైద్య ఆరోగ్య వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అంతుచిక్కని వ్యాధి గురించి అందరూ తెలుసుకోవాలని, భయపడాల్సిన అవసరం లేదని ఇరు ప్రభుత్వాలు కోరుతున్నాయి.
టొమాటో ఫ్లూ లక్షణాలు..
టొమాటో ఫ్లూ వ్యాధిలో ప్రధానంగా చికున్‌గున్యా మాదిరిగానే అధిక జ్వరం, శరీర నొప్పి, కీళ్ల వాపు, అలసట వంటి కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ వ్యాధి సోకిన పిల్లలకు దద్దుర్లు, చర్మపు అలర్జీ వంటివి కనిపిస్తున్నాయి. దీని వలన శరీర భాగాలపై బొబ్బలు, దద్దుర్లు ఏర్పడతాయని డాక్టర్లు అంటున్నారు. పొత్తికడుపు తిమ్మిరి, వికారం, వాంతులు లేదా విరేచనాలు.. చేతులు, మోకాళ్లు, పిరుదులు రంగు మారడం వంటి మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, వ్యాధికి సంబంధించిన కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. ఆరోగ్య అధికారులు టొమాటో జ్వరం యొక్క ప్రధాన కారణాలను పరిశీలిస్తున్నారు.
కేరళలో టొమాటో ఫ్లూ..
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. కేరళలోని కొల్లాంలో 80 మందికి పైగా పిల్లలకు టమోటా ఫ్లూ సోకింది. దక్షిణాదిలోని ఆర్యంకావు, అంచల్, నెదువత్తూరులో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ దాదాపు ఐదేళ్లలోపు పిల్లల్లో మాత్రమే కనిపిస్తున్నాయని డాక్టర్లు అంటున్నారు.
టొమాటో ఫ్లూ నివారణ చర్యలు..
దీనికి పరిశుభ్ర వాతావరణం ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. పైన పేర్కొన్న లక్షణాలు ఏవైనా కనిపిస్తే తల్లిదండ్రులు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సోకిన పిల్లలు దద్దుర్లు లేదా బొబ్బలు గోకడం నివారించాలని, లేకుంటే వ్యాధి తీవ్రత పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. అంతేకాకుండా వ్యాధి వ్యాప్తిని నివారించడానికి అది సోకిన వ్యక్తులతో ఇతరులు సన్నిహితంగా మెలగడం కూడా అంత మంచిది కాదంటున్నారు డాక్టర్లు. జ్వరం యొక్క దీర్ఘకాలిక ప్రభావాలను నివారించడానికి రోగులు సరైన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.