హైదరాబాద్, ఆంధ్రప్రభ: గలగల పరుగులు తీసే గోదావరి దక్కన్ పీఠభూమిలో ఎదురెక్కి అద్భుతాన్ని ఆవిష్కరించింది. అనేక కిలోమీటర్లు పరుగుతీసిన గోదావరి దిశను మార్చుకుని శ్రీరాంసాగర్ చెెరుకున్నాయి. శ్రీరాంసాగర్ పునరజ్జీవం పథకంలో భాగంగా గోదావరి జలాలు దిశను మార్చుకోవడం తెలంగాణ సాగునీటి రంగంలో రాష్ట్రం సాధించిన అద్భుత విజయం. వర్షాభావ పరిస్థితుల్లో శ్రీరాంసాగర్ జలాలు అడుగంటి పోగా కాళేశ్వరం జలాలతో పునరుజ్జీవం పొంది లక్షలాది ఎకరాల్లో జలసవ్వడి చేసేందుకు సిద్ధమయ్యాయి. గతనాలుగు రోజుల క్రితం గాయత్రి పంపు హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయగా మూడు దశల్లో 300 కిలోమీటర్లు పరుగులు తీసి దిశను మార్చుకుని శుక్రవారం శ్రీరాంసాగర్ చేరుకోవడం సాగునీటి రంగంలో ఓ అద్భుతం.
లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో 1963 జులైలో నాటి ప్రధాని నెహ్రూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా 1970 జులై 24న నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. అయితే అప్పటికే పనులు పూర్తి కాకపోవడం, సమైక్యపాలకులు ప్రాజెక్టుపై శ్రద్ధ చూపకపోవడం, ఎగువన మహారాష్ట్ర బాబ్లిd ప్రాజెక్టుతో పాటుగా 15 చిన్ననీటి ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మించడంతో శ్రీరాం సాగర్‌కు నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు మధ్యలోంచి వాహనాలు ప్రయాణించే స్థాయిలో ఎండిపోవడంతో ఆయకట్టురైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వ్యవసాయం అంటేనే బయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించగానే ప్రాజెక్టులకు రీ డిజైనింగ్ చేసి కాళేశ్వరం నిర్మించిన సీఎం కేసీఆర్ శ్రీరాంసాగర్ పునరుజ్జీవనంపై దృష్టి సారించారు. రూ.1999.56కోట్లతో పనులు ప్రారంభించి గోదావరి దిశను మార్చి శ్రీరాంసాగర్ వైపు మళ్లించే పనులు చేపట్టారు. నిర్ధిష్ట గడువులో నిర్మాణాలు పూర్తి చేసుకుని శుక్రవారం అద్భుతాన్ని ఆవిష్కరించింది.
ఇలా… ప్రయాణించాయి..
గాయత్రి పంపుహౌస్ దగ్గర కాళేశ్వరం జలాలు వరద కాలువలో ఎత్తిపోయగా… ఆ నీరు కాలువలో ప్రయాణించి వరదకాలువ 73 కిలో మీటర్ల దగ్గర నిర్మించిన రాంపూర్‌కు చేరుకున్నాయి. ఇక్కడ వరదకాలువకు అడ్డుకట్టగా నిర్మించిన ఎత్తిపోతల ప్రాజెక్టులో నీరు నిలిచి ఉంటుంది. రాంపూర్ నుంచి ఎత్తిపోసిన కాళేశ్వరం జలాలు దిశను మార్చుకుని రాజేశ్వరరావు ఎత్తిపోతలకు చేరుకున్నాయి. అక్కడి నుంచి శ్రీరాంసాగర్ సమీపంలోని ముప్కాల్ పంప్‌హౌస్ ద్వారా నేరుగా శ్రీరాంసాగర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. గాయత్రి పంప్‌హౌస్ నుంచి శ్రీరాంసాగర్ వరకు 300 కిలోమీటర్లు ప్రయాణించి శ్రీరాంసాగర్‌లోకి చేరాయి. రోజుకు 0.5 టీఎంసీ చొప్పున నీటిని 60 రోజులపాటు 30 టీఎంసీల ఎస్సార్‌ఎస్పీలో నింపనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు శ్రీరాంసాగర్ ఆయకట్టుకు కూడా భరోసాగా నిలిచింది.