Friday, November 22, 2024

రైతు ఉద్య‌మం మ‌రో చ‌రిత్ర.. పార్ల‌మెంట్‌లో చ‌ర్చ‌లేక‌పోవ‌డం దారుణం: రాకేశ్ తికాయ‌త్‌

పార్లమెంట్‌లో రైతు వ్యతిరేక చట్టాల రద్దు బిల్లు ఆమోదంపై రైతు నేత రాకేశ్‌ తికాయత్‌ స్పందిస్తూ ఈ మూడు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన 686 మంది రైతులకు ఇది నివాళి అని పేర్కొన్నారు. ఈ చట్టాలను రద్దు చేసినప్పటికీ,  వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) సమస్య పెండింగ్‌లోనే ఉందని, అందువల్ల తమ నిరసనలు కొనసాగుతాయని చెప్పారు.

రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు  చేసిన బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడంతో రైతు ఉద్యమం కొత్త చరిత్ర సృష్టించిందని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) పేర్కొంది. మూడు చట్టాలను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చకు అనుమతించకపోవడం దారుణమని నిరసించింది. ‘‘ఈ చట్టాలు మొదట జూన్‌ 2020లో ఆర్డినెన్స్‌లుగా, తర్వాత సెప్టెంబరు 2020లో పూర్తి స్థాయి చట్టాలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే హాస్యాస్పదంగా ఆ సమయంలో కూడా ఎటువంటి చర్చకు అనుమతించలేదు. ఇప్పుడు కూడా అలానే కేంద్రం చేసింది.. మూడు నల్ల చట్టాల రద్దు చరిత్రాత్మక పరిణామం అయినప్పటికీ, 686 మందికి పైగా రైతులు శాంతియుత, నిరంతర ఉద్యమంలో తమ ప్రాణాలను అర్పించారు. ఈ భారీ మానవ బలిదానాలకు మోడీ ప్రభుత్వానిదే బాధ్యత’’ అని సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది.

పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ల పరిష్కారం కోసం నిరసన తెలుపుతున్న రైతులు ఓపికగా, ఆశాజనకంగా వేచి ఉన్నారని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఎంఎస్పీ చట్టం కోసం డిమాండ్‌ చేస్తున్నారని పేర్కొంది. పలువురు ఆర్థికవేత్తలు ఈ డిమాండ్‌కు మద్దతు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఇది చాలా అవసరమని,  దేశంలోని మొత్తం ఆర్థిక వ్యవస్థకు అనేక సానుకూల ఫలితాలు ఉంటాయని పేర్కొంది రైతు సంఘం.

నిరసన తెలుపుతున్న రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణకు సంబంధించిన మరో డిమాండ్‌పై హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ కేంద్రం సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని సూచించారు. ఇది ఎస్కేఎం చెబుతున్న దాన్ని రుజువు చేస్తుంది. ఢిల్లీ, ఛండీగఢ్‌ వంటి ప్రాంతాల్లో కేసులకు సంబంధించి, ఏ విషయంలోనైనా కేంద్రం నేరుగా చెప్పాల్సి ఉంటుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌ల్లో అనేక కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం. విద్యుత్‌ సవరణల బిల్లును ఉపసంహరించుకోవడం, అమరవీరుల కుటుంబాలకు పరిహారం, అమరవీరుల స్మారక చిహ్నం, మొదలైన వాటితో సహా పెండింగ్‌లో ఉన్న అన్ని డిమాండ్లకు సంబంధించి మోడీ ప్రభుత్వం తమ బాధ్యత నుంచి తప్పించుకోలేదని ఎస్కేఎం స్పష్టం చేసింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement