Tuesday, November 19, 2024

Spl Story: దేశ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం.. కాలం చెక్కిలిపై కేసీఆర్ కొంగొత్త సంతకం బీఆర్​ఎస్​!

తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో టీఆర్‌ఎస్‌ పోషించిన భూమిక చరిత్రలో చెరగని పేజీ. ఎన్నెన్నో దారుల్లో చీలిన తెలంగాణ నినాద ఉద్యమాలను ఏకం చేసిన ఘనత కేసీఆర్‌ది. ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమించే స్థాయికి ఎదగడమనేది దేశ స్వాతంత్య్రానంతరం తెలంగాణ పోరుగడ్డపై కనిపించిన చిత్రం. అయితే.. ఈ పోరాట పటిమ ప్రజల నరనరాల్లో నిండటానికి, ప్రజల ఉచ్ఛ్వాస, నిశ్వాసగా మారడానికి చారిత్రక అంశాలు అనేకం ఉన్నప్పటికీ, కేసీఆర్‌ నాయకత్వ పటిమ, వాగ్ధాటి, వ్యూహ చతురత అతి ముఖ్యమైనవిగా నిలిచాయి. అయితే.. ఇప్పుడు అట్లాంటి పరిస్థితే దేశ రాజకీయాల్లో నెలకొంది. ఈ శూన్యతను భర్తీ చేయడానికి, మరో చారిత్రక సువర్ణ అధ్యాయం ప్రారంభించడానికి కేసీఆర్​ నడుంబిగించారు. ఇవ్వాల జాతీయ పార్టీ బీఆర్​ఎస్​ ప్రారంభిస్తున్నారు. ఇట్లాంటి శుభదినాన..  టీఆర్‌ఎస్‌ను స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకి నెలకొన్న కొన్ని మధుర క్షణాలు యాది చేసుకుందాం..

– ఇంటర్​నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

హైదరాబాద్‌- జలదృశ్యంలో 2001, ఏప్రిల్‌ 27న ఉద యం 11 గంటలకు నాటి డిప్యూటీ స్పీకర్‌, శాసనసభ్యు లు కేసీఆర్‌ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పార్టీ స్థాపించనున్నారనే వార్తను నాటి రాజకీయపార్టీలు తేలికగా తీసుకున్నాయి. గతంలో చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమంలాగే, ఇదికూడా అలాంటి ముగింపు ఇస్తుందని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు బాహాటంగా మాట్లాడారు. అయితే చంద్రబాబు మాత్రం కేసీఆర్‌ను తేలికగా తీసుకోలేదు. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్‌ ఉంది. కొత్త పార్టీ వస్తే ప్రజలు ఆలోచించే అవకాశాలున్నాయని టీడీపీ ఆఫీసులో నాయకులకు చెప్పారు. కేసీఆర్‌ పార్టీ ప్రకటన చేసిన వెంటనే, పరిణామాలను పరిశీలించాలని నాటి టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డికి చెప్పారు. కేసీఆర్‌ తన పదవు లకు రాజీనామా చేసి ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తారని టీడీపీ ఊహించలేకపోయింది.

2001 ఏప్రిల్‌ 27న ఉదయం 9 గంటల సమయం… జలదృశ్యంలో ఓ చిన్న వేదిక ఏర్పాటుచేస్తున్నారు. హరీశ్‌రావు ఏర్పాట్లను చూస్తున్నారు. కొండాలక్ష్మణ్‌ బాపూజీ తన కార్యాలయంలోనే ఉన్నారు. ఇంకా కార్యకర్తలు, తెలంగాణ వాదులు జలదృశ్యం చేరుకోలేదు. స్టేజీ ఏర్పాట్లు జరుగుతున్నా యి. జలదృశ్యం ముందు సాధారణ పరిస్థితులు. బందోబస్తు కోసం సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి కేవలం ఐదుగురు కానిస్టేబుల్స్‌ వచ్చారు. హంగులు, ఆర్భాటాల్లేవు. వాతావరణం అంతా చాలా సాధారణంగా ఉంది. అప్పుడప్పుడు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ హుస్సేన్‌సాగర్‌ అలల సవ్వడి తప్ప మరే అలికిడి, అలజడి లేదు. కానీ ఇక్కడినుంచే ఓ మహా ఉద్యమం ప్రారం భమై తెలంగాణ చరిత్ర గతులను మార్చుతుందనీ, తరతరాల తెలంగాణ బతుకులను తీర్చిదిద్దుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. తెలంగాణ కోసం కోట్లాది ప్రజలను ఒక్కతాటిపైకి కేసీఆర్‌ తీసుకొస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ కాలం అన్నింటికీ సమాధానం చెప్పింది.

జలదృశ్యంలో 30 మంది కూర్చోవడానికి ఏర్పాటుచేసిన వేదికపైకి అనేక మంది నాయకులు చేరుకున్నారు. కేసీఆర్‌ పార్టీ స్థాపించారు కానీ కార్యాలయం లేదు. ఈ విషయాన్ని కొండాలక్ష్మణ్‌ బాపూజీతో చర్చించి జలదృశ్యంలోనే తాత్కాలికంగా టీఆర్‌ఎస్‌ కార్యాలయం ఏర్పాటుచేశారు. అప్పటికప్పుడు కుర్చీలు తెప్పించి కేసీఆర్‌ నాయకులతో సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ జరిగింది. తొలుత మండలాలవారీగా టీఆర్‌ఎస్‌ జెండా పండుగ చేయాలని నిర్ణయించి పార్టీ జెండాలను మండలాలకు చేరవేసే బాధ్యతలను నాయకులకు అప్పగించారు. జలదృశ్యం సమావేశానికి జిల్లాల నుంచి వస్తున్న నాయకులను అప్పటి ప్రభుత్వం మధ్య దారుల్లోనే అరెస్టు చేయిస్తున్నదని కేసీఆర్‌కు మురళీధర్‌ దేశ్‌పాండే తెలిపారు. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలని కేసీఆర్‌ స్పష్టతనిచ్చారు. తొలి బహిరంగసభను కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల మైదానంలో నిర్వహించాలని, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అప్పటి ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి శిబూ సోరెన్‌ను ఆహ్వానించాలని తీర్మానించారు.

- Advertisement -

ఆ రోజేం జరిగింది?

ఉదయం 9 తర్వాత కేసీఆర్‌ జలదృశ్యం చేరుకున్నారు. అప్పటివరకు వేదిక తయారుకాలేదు. కొద్దిసేపు కొండా లక్ష్మణ్‌ బాపూజీతో కేసీఆర్‌ మాట్లాడారు. వేదికపై మైక్‌ అమర్చిన అనంతరం సుదర్శన్‌ రావు (మాజీ మంత్రి రామచందర్‌రావు కొడుకు), హరీశ్‌రావు నాయకులను వేదికపైకి ఆహ్వానించారు. చేతిలో మూడు కవర్లతో కేసీఆర్‌ వేదిక పైకి వచ్చారు. ఆ తర్వాత కేసీఆర్‌ మాట్లాడు తూ… తన డిప్యూటీ స్పీకర్‌ పదవికి, శాసనసభ సభ్యత్వానికి, టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తు న్నట్లు ప్రకటించారు. తన చేతిలోని కవర్లను చూపిస్తూ తన రాజీనామాలను స్పీకర్‌కు, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవ్వాలని నాయకులకు చెప్పారు.

ఆ తర్వాత.. దగాపడిన తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ చిత్రాన్ని ‘చిహ్నం’గా ప్రకటించారు. పార్టీని ‘టీఆర్‌ఎస్‌’గాను తనను ‘కేసీఆర్‌’అని పిలవాలని కార్యకర్తలను, ప్రజలను కోరారు. పార్టీ ప్రకటన వెలువడగానే అప్పటివరకు కొద్దిగా ఉన్న పోలీసుల సంఖ్య పెరిగింది.

జలదృశ్యం ముందు నుంచి వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. తెలంగాణ వాదులు, కార్యకర్తలు ‘కేసీఆర్‌ జిందాబాద్‌’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జలదృశ్యం చేరుకోవడం ప్రారంభమైంది. నాటి నుంచి ఎత్తిన జెండా దించకుండా, మడమ తిప్పకుండా కేసీఆర్‌ చేసిన తెలంగాణ ఉద్యమం అజరామరం. ప్రొఫెసర్‌ జయశంకర్‌ మార్గ నిర్దేశంలో కేసీఆర్‌ తెలంగాణలోని ప్రతి కూడలిని ఓ రణక్షేత్రంగా మలచి, దగాపడిన తెలంగాణను పరాయిపాలన నుంచి విముక్తి చేశారు.

పార్టీ ప్రారంభ రోజుల్లో కేసీఆర్‌ను విమర్శిం చిన టీడీపీ తదితర పార్టీలు తెలంగాణలో ఉనికిని కోల్పోయాయి. గుప్పెడు మందితో పోరాటాన్ని ప్రారంభించి కోట్ల మందిలో ఉద్యమస్ఫూర్తి రగిలించారు కేసీఆర్‌. రాష్ట్ర సాధన కోసం దేశాన్ని కదిలించి గమ్యాన్ని ముద్దాడి, తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న ఆధునిక గాంధీ కేసీఆర్‌. అందుకే ఆయనకు దేశ చరిత్రలో ఓ పేజీ ఉంది. ఆ పేజీలో ఉద్యమ సెగలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement