తెలంగాణ ప్రభుత్వాన్ని డిస్ట్రబ్ చేసేలా.. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం పలు రకాల ప్రలోభాలకు గురిచేసేలా కొంతమంది స్వామీజీలు చేసిన ప్రయత్నాలకు సంబంధించి ఒక్కొక్క విషయం బట్టబయలు అవుతోంది. దీనికంతటికీ కేంద్రంలోని బీజేపీ కీలక నేతలు, ఆర్ ఎస్ ఎస్ ప్రముఖులే కారణమనే విషయాలు స్పష్టమవుతున్నాయంటున్నారు టీఆర్ ఎస్ నేతలు. రామచంద్రభారతి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మధ్య జరిగిన సంభాషణలో అహ్మదాబాద్‌కు తీసుకెళ్లి నెంబర్2 తో కలిపించి మాట్లాడిస్తానని, అక్కడే అన్నీ సెటిల్ చేసుకోవచ్చనే విషయాలను ఇంతకుముందు రిలీజ్ చేసిన ఆడిలో స్పష్టంగా ఉన్నాయి.
ఇక మరో ఆడియో త్వరలోనే రిలీజ్ అవుతుందని, దాంట్లో కొనుగోలు వ్యవహారాలు, డబ్బులు ఎక్కడినించి వస్తాయనే విషయాలు ఉండబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. ఇదంతా వట్టిదేనని, తమకేమీ సంబంధంలేదని బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కోసం బీజేపీ పన్నిన కుట్రకు సంబంధించి మరో ఆడియో లీక్ అయ్యింది. ఇప్పటికే ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో రామచంద్రభారతి మాట్లాడిన ఆడియో వెల్లడికాగా, ఇప్పుడు మరో ఆడియో లీక్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. 27 నిమిషాల నిడివిగల ఈ ఆడియోలో నందు అనే వ్యక్తి రామచంద్రభారతి, సింహయాజి అనే ఇద్దరు స్వామీజీలతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లపై చేసిన సంభాషణలు ఉన్నాయి.
ఆ ఆడియోలోని సమాచారం ప్రకారం.. పైలట్ రోహిత్‌రెడ్డి మరో నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చర్చించుకున్నారు. పైలట్‌కు ఒక రేటు, వెంట వచ్చేవారికి మరోరేటు ఇవ్వాలని, మునుగోడు పోలింగ్‌లోపు చేరితే వంద కోట్లు ఇవ్వాలని మాట్లాడుకున్నారు. రాష్ట్ర నేతలు బండి సంజయ్, కిషన్‌రెడ్డిలకు అంత ప్రాధాన్యం లేదని, ఈ అంశాలను నేరుగా సెంట్రల్ డీల్ చేస్తుందని చెప్పుకున్నారు. గుజరాత్ ఎన్నికల ముందు మునుగోడు కోసం ఇంత రిస్క్ తీసుకుంటున్నామని చర్చించుకున్నారు.
ఒక్కసారి ఎంట్రీ అయితే అన్ని అమిత్ షానే చూసుకుంటారని, రోహిత్ వెంట ముగ్గురు వచ్చేందుకు రెడీగా ఉన్నారని, చేవెళ్ల, కొడంగల్, పరిగి ఎమ్మెల్యేలనూ టచ్ చేశామని, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉంటేనే ఆపరేషన్ సక్సెస్ అవుతుందని వారు డిస్కస్ చేశారు. ముందుగా నలుగురు, ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు వస్తారని ఈ సందర్భంగా నందు హామీ ఇచ్చిన విషయం స్పష్టంగా ఉంది.. కానీ, దీన్ని బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఇదంతా టీఆర్‌ఎస్ పార్టీ ఆడుతున్న డ్రామాగా అభివర్ణిస్తున్నారు.