– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ అధికారులు ఇవ్వాల ఉదయం సూరజ్ (చిరుత) మృతదేహాన్ని కనుగొన్నారు. సూరజ్ మరణానికి గల ప్రాథమిక కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. పోస్టుమార్టం పూర్తయితే కానీ మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి. చిరుతలు వరుసగా చనిపోవడం ప్రాజెక్టు అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఇక.. మంగళవారం మరో మగ చిరుత – తేజస్ కునో నేషనల్ పార్కులో చనిపోయింది. ఫారెస్ట్ అధికారుల సమాచారం ప్రకారం.. చిరుత శారీరకంగా బలహీనంగా ఉందని శవపరీక్షలో వెల్లడయ్యింది. కాగా, తేజస్ చిరుత మరో ఆడ చిరుతతో దారుణంగా పోరాడినట్టు తెలుస్తోంది. దీంతో భారత్‌లో చిరుతల నిర్వహణపై ఇది అనేక ప్రశ్నలు లేవనెత్తింది.
ఈ పునఃప్రవేశ కార్యక్రమంలో చిరుతలు చనిపోతాయని అనుకోలేదని.. కానీ, వీటి మరణాలు ఊహించని చోట మూసివున్న బోమాస్‌లో సంభవించడం మరింత ఆందోళనగా ఉందని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు. దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి 20 చీతాలను కునో నేషనల్ పార్క్‌కి తీసుకొచ్చారు. ఈ క్రమంలో నేషనల్ పార్క్ లో నాలుగు పిల్లలు పుట్టడంతో మొత్తం వాటి సంఖ్య 24కి పెరిగింది. దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో ఎనిమిది చీతాలు చనిపోవడంతో వాటి సంఖ్య ఇప్పుడు 16కి చేరింది.