మహారాష్ట్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. సీఎం ఉద్ధవ్ థాక్రేకు తన రాజీనామా లేఖను సమర్పించారు. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ హోం మంత్రిపై అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై పరంబీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలపై 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణలో తగిన సాక్ష్యాధారాలు లభిస్తే అనిల్ దేశ్‌ముఖ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో.. అనిల్ దేశ్‌ముఖ్ హోం మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
కాగా, రెస్టారెంట్లు, బార్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని హోం మంత్రి పోలీసులు అధికారులను ఆదేశించారని ఆరోపిస్తూ మాజీ సీపీ పరంబీర్ సింగ్ ఏకంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు లేఖ రాసిన విషయం విదితమే. పరంబీర్ సింగ్ రాసిన ఈ లేఖ అధికార శివసేనతో పాటు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను బర్తరఫ్ చేయాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది. హోం మంత్రిపై చేసిన అవినీతి ఆరోపణలపై పరంబీర్ సింగ్ తొలుత సుప్రీంను ఆశ్రయించారు.
మాజీ సీపీ పరంబీర్ సింగ్ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన అత్యున్నత న్యాయస్థానం.. తొలుత హైకోర్టుకు వెళ్లాలని పరంబీర్ సింగ్‌కు సూచించింది. దీంతో.. ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయశ్రీ పాటిల్ కూడా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జయశ్రీ పాటిల్ పిల్‌పై విచారించిన బాంబే హైకోర్టు తాజాగా హోం మంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ చేయాలని, 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని సూచించింది.