ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చటంతో ప్రతి రోజు దాదాపు 20వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రులకు కరోనా బాధితులు క్యూ కడుతున్నారు. దీంతో ప్రభుత్వం వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పగటిపూట కర్ఫ్యూకు కూడా సిద్ధమైంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ఇక కేసులు అధికంగా ఉన్న చోట స్థానిక అధికారులు సంపూర్ణ లాక్ డౌన్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుండి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టులోనే టెస్టులు చేసి… నెగిటివ్ వస్తేనే ఇంటికి పంపుతున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని క్వారెంటైన్ కేంద్రాలకు పంపనుండగా… ఇప్పుడు రోడ్డు మార్గంలో వచ్చినా టెస్టులను తప్పనిసరి చేశారు. రాష్ట్రంలోని అన్ని సరిహద్దుల వద్ద యుద్ధప్రాతిపదికన టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు పంపనున్నట్లు ప్రకటించారు. కాగా ఎయిర్ పోర్టుల వద్ద జనం గుమిగూడకుండా ప్రయాణికుడితో పాటు కారు డ్రైవర్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని, బంధువులు ఎవరూ రావొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.