Tuesday, November 26, 2024

నాలుగు వారాలు.. కోటి మందికి డోసులు!

ఏపీలో కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నాలుగు వారాల్లోనే కోటి మంది ప్రజలకు టీకా ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. నెల రోజుల్లో కోటి మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలనే ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రక్రియను ముమ్మరంగా కొనసాగాలని ఇప్పటికే సీఎం జగన్ ఆధికారులను సూచించారు.

అయితే, నెల రోజుల్లో కోటి మందికి వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యమైనా? అన్న ప్రశ్న సర్వత్ర వ్యక్తం అయ్యింది. అయితే, ఈ విషయంపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తో ప్రభ డిజిటల్ టీం మాట్లాడింది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు పక్క ప్రణాళిక రూపొందించినట్లు ఆయన తెలిపారు.

కోటి మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ అంటే.. రెండు కోట్ల డోసులు కావాలి. కానీ.. మన రాష్ట్రానికి ఇప్పటిదాకా వచ్చిన వ్యాక్సిన్‌ డోసులు కేవలం 24 లక్షలు. వాటిలో 20 లక్షలు.. కొవిషీల్డ్‌ డోసులు కాగా, 4 లక్షలు కొవాగ్జిన్‌ డోసులు. వచ్చిన 24 లక్షల డోసుల్లో ఇప్పటిదాకా 10.50 లక్షలకుపైగా డోసులు ప్రజలకు ఇచ్చారు. అందులో రెండు డోసులు తీసుకున్నవారు 2,19,090 మందే. మొత్తం కోటిమందిలో వీరిని తీసేస్తే.. సింగిల్‌ డోసు వేసుకున్నవారు, అసలు వేసుకోనివారు అంతా కలిపి దాదాపు 97లక్షల మందికిపైగా ఉంటారని అంచనా. కానీ చేతిలో ఉన్నది 13.5లక్షల డోసులే. కాబట్టి, డిమాండుకు తగినట్టుగా రాష్ట్రప్రభుత్వం ఏర్పా ట్లు చేయాలని.. సరిపడినన్ని వ్యాక్సిన్లు పంపాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీంతో ఏపీకి అవసరం అయిన డోసులు సరఫరా చేసేందుకు సిద్ధం అంటూ కేంద్రం తెలిపింది.

గ్రామీణ ప్రాంతాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ఒక్కో మండలంలో వారంలో నాలుగు రోజులు.. రోజుకు 2 గ్రామాలు చొప్పున వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టాలన్న ప్రభుత్వ సూచనల ప్రకారం అధికారులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. సీఎం ఆదేశాలతో గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ టీకా పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇక, వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కోసం గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, ఆశావర్కర్లు, హెల్త్‌ వర్కర్లును భాగస్వాములు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.8 లక్షల గ్రామ వాలంటీర్లు ఉన్నారు. పీహెచ్‌సీల్లో డాక్టర్ల కొరత లేకుండా చూసుకుంటున్నారు. 104లతో అనుసంధానంగా ఉన్న డాక్టర్ల సంఖ్య సరిపోతున్నారా? లేదా అన్నది ముందుగానే చూసుకున్నారు. మండలానికి రెండు పీహెచ్‌సీలు, ఒక్కో పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యులను నియమించారు. అంతేకాదు, వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18 వేల మంది నర్సులను తీసుకున్నారు. అలాగే ప్రతి మండలానికి రెండు 104 వాహనాలు, ఒక్కో వాహనంలో ఒక్కో డాక్టరను కేటాయించారు. ఈరకంగా మండలానికి ఆరుగురు వైద్యులు ప్రతి మండలంలో ఉండేలా ప్లాన్ చేశారు. దీనికి అవసరమైన నిధులను కూడా ప్రభుత్వం కేటాయించింది. వారానికి 25 లక్షల చొప్పున నాలుగు వారాల్లో 1 కోటి మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ వివరించారు.

- Advertisement -

ఈ ఏడాది జనవరిలో దేశంలో మొదటి దశ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి విడతలో హెల్త్‌ కేర్‌ వర్కర్స్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు వ్యాక్సిన్ పంపిణీ చేశారు. రెండో దశలో 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకా ఇస్తున్నారు. తాజాగా మూడో దశలో 45 ఏళ్లు నిండి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేనివారికి కూడా టీకా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ లక్షాన్ని చేరుకుంటామనే ధీమా వైద్య అధికారుల్లో వ్యక్తం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement