Saturday, November 23, 2024

ప్రాజెక్టుల వద్ద హై టెన్షన్.. కృష్ణా బేసిన్‌లో పోలీసుల పహారా!

కృష్ణా జలాల వివాదంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు రాష్ట్రల మధ్య ఉన్న ప్రాజెక్టులన్నీ పోలీసు పహారాలోకి వెళ్లాయి. జూరాల మొదలుకొని పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల వద్ద భారీగా పోలీసులను మొహరించారు. ఇరు రాష్ట్రాల జల వివాదాల నేపథ్యంలో కృష్ణా బేసిన్‌లోని జూరాల, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల వద్ద కూడా పోలీసు పహారా కొనసాగుతోంది.

కృష్ణా జల వివాదాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి కొనసాగిస్తోంది. దీంతో ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం వద్ద తెలంగాణ పోలీసులు.. శ్రీశైలం డ్యాం వద్ద ఆంధ్రా పోలీసులు మోహరించారు. తెలంగాణ ప్రభుత్వం ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తిని కొనసాగించడంతో రోజూ 4 టీఎంసీల నీరు దిగువకు వెళుతోంది. అయితే, దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. శ్రీశైలంలో 854 అడుగుల కంటే ఎక్కువ నీరు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ జిల్లాలకు నీటిని తరలించే అవకాశం ఉంటుందని.. లేదంటే సీమ ప్రాంతం ఎడారి అవుతుందని ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. ఈ రెండు ప్రాజెక్టుల్లో జల విద్యుదుత్పత్తి ఆపాలని ఏపీ అధికారులు విజ్ఞప్తి చేసినా.. తెలంగాణ జెన్‌కో అధికారులు లెక్కచేయకుడా ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక, పులిచింతల వద్ద 60 మంది, నాగార్జున సాగర్‌ వద్ద 150మందితో భద్రత కొనసాగిస్తున్నారు.

మరోవైపు నాగార్జున సాగర్‌లో ప్రస్తుతం 176 టీఎంసీల నీరు నిల్వ ఉండగా..అక్కడ తెలంగాణా జెన్‌కో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఖరీఫ్ సీజన్ ఇంకా ప్రారంభం కానందున జలవిద్యుత్ కోసం వినియోగించే నీరు సముద్రంలో కలిసి వృథా అవుతుందని ఏపీ అధికారులు అంటున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఆయా జిల్లాల ఎస్పీలు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జూరాల నుంచి పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల్లోనూ తెలంగాణ విద్యుదుత్పత్తిని కొనసాగిస్తోంది. పోతిరెడ్డిపాడు వద్ద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని తెలంగాణ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement