Thursday, November 21, 2024

ఏపీలో మళ్లీ ఉపఎన్నికలు తప్పవా?

ఏపీలో మరికొద్ది వారాల్లో తిరుపతి ఎంపీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. అయితే ఏపీలో కొద్ది విరామంలోనే మళ్లీ ఉపఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. దాదాపు నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే అధికార పార్టీ వైసీపీతో టచ్‌లో ఉన్నారు. వల్లభనేని వంశీ (గన్నవరం), కరణం బలరాం (చీరాల), మద్దాల గిరి (గుంటూరు వెస్ట్), వాసుపల్లి గణేష్ (విశాఖ సౌత్) టీడీపీ గుర్తుతో గెలిచినా వైసీపీతో అంటకాగుతున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం టీడీపీలా తాము అనైతిక రాజకీయాలు చేయమని చెప్తున్నారు. తమ పార్టీలో చేరే నేతలతో రాజీనామా చేయించి తమ పార్టీ టికెట్ మీద గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే పలు కారణాల వల్ల ఇప్పటివరకు వైసీపీతో ఉన్న టీడీపీ నేతలను ఎన్నికలకు పంపలేకపోయారు.

అటు టీడీపీ ఎమ్మెల్యే గంటా ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎప్పటినుంచో వైసీపీలోకి జంప్ చేద్దాం అనుకుంటున్న గంటా.. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కారణంగా ఉన్నట్టుండి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించాల్సి ఉంది. అటు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైసీపీ తమ వ్యూహ రచనలకు మరింత పదును పెట్టింది. తిరుపతి ఉపఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచినట్లయితే ఫలితాలు వెలువడిన నెల రోజుల్లోపే వైసీపీతో అంటకాగుతున్న నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది. గంటా రాజీనామాతో కలుపుకుని ఏపీలో మొత్తం ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మరి ఐదు స్థానాలకు ఒకేసారి ఎన్నికలు వచ్చేలాగా వైసీపీ ప్లాన్ చేస్తుందా లేక తమ పార్టీ మీద ఉన్న పాజిటివ్ వేవ్ మరింత కాలం కొనసాగేలా ముందు కొందరితో.. ఆ తర్వాత కొందరితో రాజీనామా చేయిస్తుందా అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఒకవేళ ఉపఎన్నికలు వస్తే గంటా శ్రీనివాసరావు ఏ పార్టీ గుర్తుతో పోటీ చేస్తారో వేచి చూడాలి. ఎందుకంటే ఆయన వైసీపీలో చేరాలని ఉవ్విళ్లూరుతున్నా.. ఎంపీ విజయసాయిరెడ్డి అడ్డుపుల్ల వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ గంటా వైసీపీలో చేరితే ఇప్పటికే అధికార పార్టీలో విశాఖ జిల్లా నుంచి అవంతి శ్రీనివాస్ ఉన్న కారణంగా విభేదాలు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement