ఏపీలో రాజకీయాల్లో 2024 ఎన్నికల్లో పొలిటికల్ వారసులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఒకరా ఇద్దరా.. ఏకంగా ఆరుగురు మాజీ ముఖ్యమంత్రుల కుటుంబాలు హోరాహోరీ పోరులో తలపడేందుకు రెడీ అయ్యియి. ఎనిమిది మంది అభ్యర్థులు ఇట్లా తమ విజయం కోసం గోదాలో దిగి అదృష్టాన్ని తేల్చుకోనున్నారు. దివంగత సీఎంలు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, డాక్టర్ ఎన్టీ రామారావు, కోట్ల విజయభాస్కరరెడ్డి, నెదురుమల్లి జనార్థన్ రెడ్డి బిడ్డలు.. మాజీ సీఎం చంద్రబాబు కుటుంబాలు సైతం తాజా ఎన్నికల్లో తమ సత్తా చాటుకునేందుకు సన్నద్ధమయ్యాయి కొందరు అధికార పార్టీ అభ్యర్థులుగా.. మరికొందరు ప్రతిపక్ష అభ్యర్థులుగా బరిలో కదం తొక్కుతున్నారు. ఈ ఎనిమిది మంది అభ్యర్థుల రాజకీయ ప్రస్థానం.. ప్రస్తుత స్థితిగతిని పరిశీలిస్తే.. ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇవన్నీ ఏపీలో నరాలు తెగే ఉత్కంఠకు తెరతీస్తున్నాయి.
(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్సార్ కుటుంబం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఎప్పట్లాగే కడప జిల్లా పులివెందుల నుంచి రేసులో నిలిచారు. తండ్రి పేరిట స్థాపించిన పార్టీని అధికారంలోకి తీసుకు రావటమే కాదు.. ప్రజల్లో అన్నగా, తమ్ముడిగా.. మేనమామగా.. ఒకరకంగా ఏపీలోని ప్రతి కుటుంబ బిడ్డగా ఎదిగిపోయారు. ఈ నియోజకవర్గంలో జగన్‌కు తిరుగులేదని గణాంకాలు నిరూపిస్తున్నాయి. 2014లో టీడీపీ అభ్యర్థి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డిపై 75,243 ఓట్ల మెజారిటీతో, 2019లో ఇదే అభ్యర్థి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డిపై 89,708 ఓట్ల మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. తాజా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారారు. మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రెడ్డి) పోటీ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య పోటీ ఏకపక్షమా? హోరాహోరీనా? అనేది ఎన్నికల ప్రక్రియలో తేలుతుంది.
జగనన్న బాణం.. సీన్ రివర్స్
వైఎస్సార్ తనయ షర్మిల కూడా ఈ సారి ఏపీ నుంచే ఎన్నికల బరిలో కీలకం కానున్నారు. జగనన్నకు వ్యతిరేకంగా పోరాటానికి సర్వసన్నద్ధం అయ్యారు. అయితే.. పులివెందులలో కాకుండా… కడప ఎంపీగా పోటీ చేస్తారని కాంగ్రెస్ అధిష్టానం నుంచి సమాచారం లీక్ అయ్యింది. తొలుత పుట్టిన గడ్డ కమలాపురం నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు షికార్లు చేశాయి. కానీ, తన బాబాయి వివేకనందారెడ్డి హత్యోదంతంతో.. తన దాయాది సోదరి న్యాయపోరాటానికి ప్రజాతీర్పు బాధ్యతను షర్మిల భుజానికి ఎత్తుకుంటోందని సమాచారం. అదే జరిగితే ఇక్కడ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిపై పోటీ చేస్తారు. నిజానికి కడప ఎంపీ నియోజకవర్గం వైఎస్సార్‌కు కంచుకోట. ఆయన మరణానంతరం వైసీపీకి దుర్బేధ్య కోటగా అవతరించింది.
2009 ఎన్నికల్లో..
2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా జగన్ మోహన్ రెడ్డి 1,78,846 ఓట్ల మెజారిటీతో కడప నుంచి గెలిచారు. 2011 ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా జగన్ ఏకంగా 5,45,572 భారీ మెజారిటీతో చరిత్ర సృష్టించారు. వైఎస్ఆర్ ఆకస్మిక మరణంతో తట్టుకోలేక పోయిన కడప ప్రజలు భారీ మెజారిటీ విజయాన్ని అందించారు. ఆ తర్వాత 2014లో వైఎస్ అవినాష్ తెరమీదకు వచ్చారు. టీడీపీ అభ్యర్థి రెడ్డిప్పగారి శ్రీనివాసరెడ్డిపై 1,90,323 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019లో టీడీపీ అభ్యర్థి సీ.ఆదినారాయణ రెడ్డిపై 3,80,726 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తాజాగా ఇంతవరకూ టీడీపీ అభ్యర్థి ఎవరో తేలలేదు. ఇక జగనన్న చెల్లి షర్మిలను బరిలో దించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. వివేకనంద హత్య కేసులో అవినాష్‌పై డాక్టర్ సునీత తీవ్ర ఆరోపణలు చేస్తున్న తరుణంలో.. షర్మిల పోటీ అనివార్యమైతే.. ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కాని స్థితి. వైఎస్ కుటుంబ అభిమానులు అవినాష్ కు దూరమవుతారా? లేక ఇదంతా కుటుంబ తగాదాగా లైట్ తీసుకుంటారా? వివేక హత్యపై సానుభూతితో షర్మిలకు మద్దతు పలుకుతారా? అనేది సమాధానం లేని ప్రశ్న.
బాబు బిడ్డ గట్టెక్కేనా?
బీసీల రాజకీయ సామ్రాజ్యం మంగళగిరి నియోజకవర్గంలో మాజీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. 2014కు ముందు బీసీ నాయకుల అడ్డాగా వెలిగిన ఈ నియోజవర్గంలో తొలిసారిగ రెడ్డి సామాజిక వర్గం గద్దెను స్వాధీనం చేసుకుంది. 2019లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై టీడీపీ అభ్యర్థి లోకేష్ సుమారు 5,337 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీ బలంతో శాసన మండలికి నామినేట్ అయ్యారు. తండ్రి కేబినెట్‌లో మూడు శాఖల మంత్రిగా పనిచేశారు. ఈ సారి మళ్లీ మంగళగిరి వేదికపై పోటీకి సిద్ధపడుతున్నారు. అయితే.. ఈ సారి వైసీపీ బీసీ బ్రహ్మస్త్రాన్ని సంధించింది. ఇద్దరు రాజకీయ ఉద్దండుల కుటుంబాలకు చెందిన మురుగుడు లావణ్యతో పోటీ పడుతున్నారు. మరి బీసీల బలగాన్ని తట్టుకోగలరా? లేక ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో గట్టెక్కగలరా? అన్నది వేచి చూడాల్సిందే.
అన్న ఎన్టీఆర్ వారసత్వంపై బీసీ బ్రహ్మాస్త్రం
అందరి అన్నగా మన్ననలు అందుకున్న నందమూరి రామారావు కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలు, మరో ఆడబిడ్డ భర్త చంద్రబాబు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. 40 ఏళ్లుగా అప్రతిహత విజయంతో కుప్పంలో పాగా వేసిన చంద్రబాబు ఈ సారి తీవ్ర పోటీ ఎదుర్కోబోతున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మంగళగిరిలో తనయుడిపై బీసీ అభ్యర్థి పోటీకి సిద్ధపడగా.. కుప్పంలోనూ చంద్రబాబుపై బీసీ అభ్యర్థి కేఆర్జె భరత్ బరిలోకి దిగారు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీ రామారావు పిల్లలు నందమూరి బాలకృష్ణ శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి మూడోసారి పోటీలో నిలిచారు. నిజానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురం నియోజకవర్గంలో నందమూరి కుటుంబానికి పెట్టని కోటగా పేరొందింది. ఎన్టీఆర్ ఇక్కడి ప్రజల అభిమానం అంతా ఇంత కాదు. చివరకు ఆయన తనయుడు బాలకృష్ణకూ ఓటమి ఉండదని అందరూ భావించారు. కానీ, ఈ ఎన్నికల్లో ఓ బీసీ వనిత టీజీఎన్ దీపిక పోటీ పడుతోంది. ఒక రకంగా ఎన్టీఆర్ వంశంపై వైఎస్ జగన్ బీసీ బ్రహ్మస్త్రాన్ని సంధించారు. ఈ అస్త్రం ఎంతవరకూ ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.
పురందేశ్వరీ కథలో సస్పెన్స్..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారని తెలుస్తోంది. బాపట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా సినీ నిర్మాత రామానాయుడును ఓడించి పార్లమెంటు గడపతొక్కిన ఎన్టీఆర్ తనయ పురందేశ్వరీ ఏపీ రాజకీయాల్లో కీలక శక్తిగా మారారు. విశాఖపట్నం ఎంపీగా, కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పారు. రాష్ట్ర విభజన అనంతరం బీజేపీలో చేరి.. 2014 ఎన్నికల్లో రాజంపేట లోక్ సభ స్థానంలో పోటీ చేశారు. అక్కడి వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డిపై 1,74,762 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. 2019లో ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ మిత్రత్రయం బలంతో లోక్ సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. రాజమండ్రి స్థానంలో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంకా బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయలేదు. దీంతో పురందేశ్వరీ కథలో కాసేపు సస్పెన్స్ సీన్ నడుస్తోంది.
మరో ముగ్గురు దివంగత సీఎంల తనయులు
మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారులు సూర్యప్రకాష్ రెడ్డి, రామ్ కుమార్ రెడ్డి కూడా ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తోన్నారు. నంద్యాల జిల్లాలోని డోన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా సూర్యప్రకాష్ రెడ్డి, తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి వైసీపీ తరఫున నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి రేసులో నిలిచారు. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు కుమారుడు నాదెండ్ల మనోహర్.. గుంటూరు జిల్లాలోని తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో దిగారు. జనసేన తరపున ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయడం ఇది తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున ఇదే తెనాలి నుంచి మనోహర్ రెండుసార్లు విజయం సాధించారు.