Saturday, November 23, 2024

నేటి నుంచి ఏపీలో కర్ఫ్యూ.. మినహాయింపు ఇవే!

కరోనా కట్టడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా నేటి నుంచి 2 వారాల పాటు పాక్షిక కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రెండు వారాలు 18 గంటల పాటూ కర్ఫ్యూ కొనసాగుతుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144వ సెక్షన్‌ విధిస్తారు. వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు వంటి వాటిని మూసివేయాలి. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆటోలు, ట్యాక్సిలు, సిటీ బస్సులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తిరిగేందుకు అనుమతిస్తారు. అంతర్రాష్ట్ర బస్సులు, జిల్లాల మధ్య బస్సు సర్వీసులు కూడా నడుపరు.

కర్ఫ్యూ నిబంధనల్ని, మార్గదర్శకాలను వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వివాహ వేడుకలకు 20 మందికి మించి హాజరవడానికి లేదని స్పష్టం చేశారు. అది కూడా స్టానిక అధికారుల నుంచి ముందస్తు అనుమతితో కొవిడ్‌ నిబంధనల్ని పాటిస్తూ నిర్వహించుకోవాలి. ప్రభుత్వం మినహాయింపునిచ్చిన అత్యవసర విభాగాలు, సేవల రంగాల్లో పనిచేస్తున్నవారు తప్ప మిగతా వ్యక్తులెవరు కర్ఫ్యూ సమయంలో బయట తిరగడానికి వీల్లేదు. వ్యవసాయ రంగానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ.. వ్యవసాయశాఖ జారీ చేసే కొవిడ్‌ మార్గదర్శకాలను అనుసరించి నిర్వహించుకునేందుకు అనుమతిచ్చారు.

వైద్య సేవల కోసం ఆస్పత్రులకు వెళ్లే గర్భిణిలు, రోగులకు అనుమతి ఉంది. ప్రభుత్వం ఎంపిక చేసిన ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి వెళ్లేవారికి అనుమతి ఇస్తారు. ప్రభుత్వ, పైవేటు ఆరోగ్య సంస్థల్లో వైద్య సేవలు పొందుతున్నవారు, ఆరోగ్య సేవలు పొందేందుకు పైవేటు వాహనాల్లో వెళ్లేందుకు అవకాశం ఉంది. విమ్రానాశ్రయాలు, రైల్వే స్టేషన్ బన్‌ స్టాండకు వెళ్లేవారు.. అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులు టిక్కెట్‌ చూపించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయస్థానాల్లో పనిచేసే ఉద్యోగులు, స్థానిక సంస్థల అధికారులు, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది విధులు నిర్వహించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యులు, వైద్యసిబ్బంది విధులు నిర్వహించవచ్చని ప్రభుత్వం తెలిపింది. రాకపోకలు జరిపే సమయాల్లో గుర్తింపు కార్డులను తప్పక ధరించాలని స్పష్టం చేసింది.

ఇక, ఆర్టీసీ బస్సులకు సంబంధించి.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రజా రవాణా వాహనాలు నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో బస్సులు, ఆటోలు, క్యాబ్‌ లు వంటివి మధ్యాహ్నం తర్వాత నడిపేందుకు అవకాశం లేదు. బస్సులు తిరిగేందుకు ఆరుగంటలే సమయం. ఆయా జిల్లాల పరిధిలోని, పక్క జిల్లాలకు వెళ్లే సర్వీసులనే ఆర్టీసీ నడపనుంది. ఇతర రాష్ట్రాలకు తిరిగే సర్వీసులు అన్నింటినీ నిలిపేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటికే బెంగళూరు, చెన్నైకు బస్సులు నిలిపివేయగా.. తాజాగా హైదరాబాద్‌ కు సర్వీసులు ఆపేశారు. దూర ప్రాంత సర్వీసులు దాదాపు నిలిపేస్తామని అధికారులు తెలిపారు.

మరోవైపు ఏపీ సరిహద్దు వద్ద నేటి నుంచి ఆంక్షలు విధించనున్నారు. అత్యవసర వాహనాలు, గూడ్స్, ట్రాన్స్‌ పోర్ట్ వాహనాల మినహాయించి ఇతర ఏ వాహనాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. రెండు వారాలపాటు ఏపీ బార్డర్లో ఈ ఆంక్షలే అమలులో ఉంటాయని.. వాహనదారులు గమనించాలని కోరారు. అలాగే నిత్యావసరాలు, ఇతర సరుకులు రవాణా చేసే వాహనాలకు మాత్రం అనుమతి ఉంది. వారికి కర్ఫ్యూ ఆంక్షలు వర్తించవని అధికారులు తెలిపారు. అయితే లోడింగ్, అన్ లోడింగ్ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపే చేయాల్సి ఉంటుంది.

- Advertisement -

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కర్ప్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. టెలికమ్యునికేషన్స్, ఇంటర్నెట్ సర్వీసులు, బ్రాడ్ కాస్టింగ్ సర్వీసులు, ఐటీ సర్వీసులకు మినహాయింపు ఉంది. పెట్రోల్ పంపులు, ఎల్పీజీ, సీఎన్జీ, పెట్రోలియం, గ్యాస్ అవుట్ లెట్లు, విద్యుత్పత్తి, పంపిణీ, సరఫరా సంస్థలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య సిబ్బంది, కోల్డ్ స్టోరేజి, వేర్ హౌసింగ్, ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులకూ కర్ఫ్యూ వర్తించదు.ఆస్పత్రులు, ల్యాబ్ లు, మెడికల్ దుకాణాలు, సహా అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది. సరకు రవాణా వాహనాలను అనుమతిస్తారు. అత్యవసర వైద్య సేవలు కావాల్సిన వారు, కొవిడ్ వ్యాక్సిన్ వేసుకొనేందుకు వెల్లేవారికి మినహాయింపు ఉంది. . ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆంక్షలను తప్పక అమలు చేయాలని కలెక్టర్లు, పోలీసు అధికారులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement