Friday, November 22, 2024

Andhra Pradesh – రబీలో తగ్గిన సాగు..ఖరీఫ్‌లో పాతిక లక్షల ఎకరాలు సేద్యం లేక బీడు

అమరావతి, ఆంధ్రప్రభ :
రబీ సేద్యం కూడా తరుగులోనే ఉంది. జనవరి వచ్చినా సాగు సాగట్లేదు. ఇప్పటికి కావాల్సిన సాధారణ సాగు విస్తీర్ణంలో పదకొండు లక్షల ఎకరాలు తక్కువ నమోదైంది. వరి, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, అన్నీ తక్కువే సాగయ్యాయి. కరువు, వర్షాభావం, డ్రైస్పెల్స్‌ మూలంగా ఈ తడవ ఖరీఫ్‌లో పాతిక లక్షల ఎకరాలు సేద్యం లేక బీడు పడ్డాయి. సాగైన పంటలూ దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో వచ్చిన మిచౌంగ్‌ తుపాను పండిన కాస్తంత పంటనూ ఊడ్చేసింది. ఖరీఫ్‌ నష్టాల నుంచి బయట పడేందుకు రైతాంగం రబీ పంటలపై ఎంతో ఆశలు పెట్టు-కున్నారు. ప్రాజెక్టుల్లో నీటి కొరత కారణంగా సాగుకు నీరివ్వబోమని చాలా చోట్ల ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటలు వేయాలని సూచించింది. సబ్సిడీపై విత్తనాలిస్తామని హామీ ఇచ్చింది. అయినప్పటికీ రబీ సాగులో అంతగా పురోగతి లేదు.

రాష్ట్రంలో రబీ సాధారణ సాగు విస్తీర్ణం 56 లక్షల ఎకరాలు కాగా డిసెంబర్‌ 31 వరకు 19.5 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. సీజన్‌ నార్మల్‌లో 34 శాతమే సాగు నమోదైంది. కాగా ఈపాటికి సాగు కావాల్సిన విస్తీర్ణం 30.87 లక్షల ఎకరాలు. ఆ ప్రకారం చూస్తే 62 శాతం పంటలు సాగయ్యాయి. కాగా నిరుడు ఇదే సమయానికి 26.50 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. గతేడాది కంటే ఈ మారు ఏడు లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. రబీలో ఆహార ధాన్యాలు ఎక్కువ వేస్తారు. వరి, శనగ, మినుము, మొక్కజొన్న, పెసర, జొన్న సాగు అధికం. ఈ పంటలు సైతం తగ్గాయి. వరి 15 శాతం, శనగలు 51 శాతం, మినుములు 44 శాతం, పెసలు 22 శాతం, మొక్కజొన్న 33 శాతం, జొన్నలు 52 శాతం సాగయ్యాయి. వాణిజ్యపంట పొగాకు ఈ తడవ కొంత వరకు బానే పడింది. ఇప్పటికి 92 శాతం వేశారు.

రబీ కాలం అక్టోబర్‌ నుంచి మొదలైంది. ఇప్పటికి మూడు మాసాల సమయం పూర్తయింది. రబీ పంటలకు ఇదే అదను. సరిగ్గా ఇప్పుడే వర్షాభావం తిష్టవేసింది. మిచౌంగ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రబీ పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తిరిగి విత్తుకోవాల్సి వచ్చింది. సాధారణంగా రబీ సాగులో సింహభాగం డిసెంబర్‌తోనే ముగుస్తుంది. వరి, మరికొన్ని పంటలు జనవరి, ఫిబ్రవరిలో సాగవుతాయి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో కేవలం వరి నాట్లు- మాత్రమే మార్చి రెండవ వారం వరకు పడతాయి. ప్రస్తుతం నెలకొన్న ధోరణి చూస్తుంటే రబీలో సైతం సాధారణ సాగును చేరే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement