Saturday, November 23, 2024

ఎల్లుండే ఏపీ అసెంబ్లీలో బడ్జెట్

2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఈనెల 20న అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. అసలే రెవెన్యూ లోటు.. ఆపై కరోనా కష్టకాలం కొనసాగుతున్న తరుణంలో ఏపీ బడ్జెట్ ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. కరోనా కష్టకాలంలో బడ్జెట్ రూపకల్పన అధికారులకు కత్తి మీద సాములా మారిందనే చర్చ జరుగుతోంది. ఈసారి బడ్జెట్ రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.38 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.

గతేడాది అనుభవాలతో ఆదాయ, వ్యయాలకు సంబంధించిన అంచనాలను ఆర్థికశాఖ రూపొందిస్తోంది. గతేడాది బడ్జెట్‌లో అంచనా వేసిన విధంగా ఆదాయాన్ని ఏపీ ప్రభుత్వం అందుకోలేకపోయింది. గతేడాది సుమారు రూ. 1.82 లక్షల కోట్ల వ్యయం కాగా, ఆదాయం మాత్రం కేవలం 77, 560 కోట్లు మాత్రమే అని తెలుస్తోంది. గత ఏడాది రూ. లక్ష కోట్లకు పైగా బడ్జెట్ లోటు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ఏడాది బడ్జెట్ ఎలా ఉంటుందన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

మరోవైపు బడ్జెట్ ప్రవేశపెట్టే అదేరోజు ఉదయం 8:30 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని మీటింగ్ హాల్‌లో కేబినెట్ సమావేశం జరగనుండగా.. 2021-22 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement