ఓ మహిళను మోసం చేసిన ఛీటింగ్ కేసులో యాంకర్ శ్యామల భర్త, నటుడు నరసింహారెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. బెయిల్‌పై విడుదలైన నరసింహారెడ్డి తన తప్పు ఏమీ లేదని అన్నాడు. ఈ మేరకు ఓ వీడియోలో మాట్లాడాడు. తనపై తప్పుడు కేసు పెట్టారని నరసింహారెడ్డి తెలిపాడు. తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపాడు. భగవంతుడి దయ వల్ల తాను తిరిగి ఇంటికి వచ్చేశానని అన్నాడు. సోషల్ మీడియాలో తన గురించి వస్తోన్న కథనాలకు సంబంధించిన అన్ని నిజానిజాలను చెప్పడానికి మరికొన్ని రోజుల్లో మళ్లీ వస్తానని, కేసు ఏమిటి? అందులోని నిజానిజాలేమిటో చెబుతానని చెప్పాడు. అన్నిరకాల ఆధారాలను తాను చూపుతానని, తనకు న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నాడు. తనపై పెట్టింది తప్పుడు కేసు అనడానికి ఆధారాలతో తాను రెండు రోజుల్లోనే ప్రజల ముందుకు వస్తానన్నాడు. కొన్నిసార్లు మనపై ఇలాంటి నిందలు పడుతుంటాయని చెప్పాడు. అయినప్పటికీ వదంతులపై తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉందని, అందుకు మీ ముందుకు వచ్చానని చెప్పాడు.
కాగా, తన వద్ద కోటి రూపాయిలు తీసుకుని లైంగిక వేధింపులకు గురి చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో నరసింహారెడ్డి పై కేసు నమోదైంది. 2017 నుంచి ఇప్పటి వరకూ తన దగ్గర కోటి రూపాయిల వరకూ డబ్బులు వసూలు చేశాడని.. తనని మోసం చేశాడని ఆ మహిళ ఆరోపిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ఈ ఇద్దరి మధ్య రాయబారం నడిపిన మరో మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళతో కూడా నరసింహకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై గత రెండు నెలలుగా గొడవలు జరుగుతుండగా.. ఆ మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్యామల భర్త నరసింహా రెడ్డి అరెస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారంపై యాంకర్ శ్యామల కూడా స్పందించింది. తన భర్త తప్పు చేయడని.. ఇది తప్పుడు కేసు అని అన్నారు. కోటి రూపాయిల కోసం ఒక ఆడపిల్లని మోసం చేయాల్సిన అవసరం కానీ.. అలాంటి వ్యక్తిత్వం కానీ తన భర్త నరసింహది కాదని చెప్పింది.