Saturday, November 23, 2024

omicron: ఒమిక్రాన్ కు ఆనందయ్య మందు.. పంపిణీని అడ్డుకున్న గ్రామస్తులు

కరోనా సెకండ్ వేవ్ సమయంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య మందుకు భారీగా డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందుకు కోసం ఆయన ఇంటి ముందు పడిగాపులు కాశారు. ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా బాధితులు నెల్లూరుకు క్యూ కట్టారు. కరోనాకు మందు తయారు చేసి దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య.. ఇప్పుడు ఒమిక్రాన్ కు కూడా మందును తయారు చేశారు.

రాష్ట్రంలో ఇప్పటికే ఆరు ఒమిక్రాన్ కేసులు నమోదైయ్యాయి. ఈ నేపథ్యంలో ఆనందయ్య మందు కోసం మరోసారి డిమాండ్ ఏర్పడింది. ఒమిక్రాన్ కు తన వద్ద మందు ఉందని, 48 గంటల్లో వ్యాధిని తగ్గిస్తానంటూ ఇటీవల ఆనందయ్య సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆనందయ్య ఇంటికి ప్రజలు బారులు తీరుతున్నారు. మందు పంపిణీ కూడా మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆనందయ్య మందు పంపిణీని గ్రామస్తులు అడ్డుకున్నారు.  అనుమతి లేకుండా.. ఎలాంటి లైసెన్సు లేకుండా ఎలా మందు పంపిణీ చేస్తారంటూ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు ప్రశ్నించారు. ఆనందయ్య వల్ల గ్రామాల్లో అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. చిన్న పిల్లలు అనారోగ్యానికి గురై హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారని, గ్రామంలోకి బయటి వ్యక్తుల రాక వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆనందయ్య మందు పంపిణీ ఆపాల్సిందేనని పట్టుబడుతూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో ఆనందయ్య ముందే పంచాయతీల ఏర్పాటు చేసిన గ్రామస్థులు.. మందు పంపిణీకి అనుమతి ఉంది అంటూ ప్రశ్నించారు.

కాగా, ఒమిక్రాన్ సోకకుండా సుమారు 22 రకాల దినుసులతో ఐదు రకాల మందులు తయారు చేసినట్టు ఇటీవల ఆనందయ్య ప్రకటించారు. ఈ మందును ఒకే రోజు రెండు పూటలా తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. తన మందుల తయారీకి కోర్టుల అనుమతి కూడా ఉందని చెప్పారు. ఒమిక్రాన్ సోకిన వారు మందు కోసం తనను సంప్రదించవచ్చని ఆనందయ్య తెలిపారు. ప్రస్తుతం ఈ మందును బంధువులు, మిత్రుల ద్వారా ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న యూకే, యూఎస్ఏ తదితర దేశాలకు ఎక్కువగా పంపిస్తున్నామని చెప్పారు. ఈ మందును ఏడాది పాటు నిల్వ ఉంచుకోవచ్చని తెలిపారు. మందు తీసుకునే వారు 15 రోజుల పాటు మాంసాహారం, మద్యం తీసుకోకూడదని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement