మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు కు ఆహ్వానం అందింది. అక్టోబర్ 4వ తేదీన స్విడ్జర్లాండ్ రాజధాని జ్యూరీక్ (zurich) లో జరిగే సమావేశానికి హాజరుకావాలని ఆసియా లీడర్స్ సిరీస్ ఫోరం ఆహ్వానం పంపింది. ఆసియా-యూరప్ ఖండాల్లోని పలు దేశాల్లో పెరుగుతున్న రాజకీయ అనిశ్చితులతో దెబ్బతింటున్న ప్రముఖ కంపెనీల వ్యాపార అవకాశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఆసియా, యూరప్ దేశాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
“మీలాంటి గౌరవనీయమైన, ప్రభావవంతమైన వ్యక్తుల మధ్య అర్థవంతమైన, ఆలోచనాత్మకమైన చర్చను నిర్వహించడం మా లక్ష్యం”అని మంత్రి కేటీఆర్‌కు పంపిన ఆహ్వాన లేఖలో ఆసియా లీడర్స్ సిరీస్ వ్యవస్థాపకుడు కల్లమ్ ఫ్లెచర్ తెలిపారు. ఆసియా లీడర్స్ సిరీస్ నుంచి ఆహ్వానం అందడంపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో ఆలోచనలు పంచుకునేందుకు ఇదో చక్కటి వేదిక అవుతుందన్నారు.
ఈ సమావేశానికి సర్ జాన్ స్కార్లెట్, బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (MI6) మాజీ చీఫ్, మార్గరీట లూయిస్-డ్రేఫస్, LDC గ్రూప్ చైర్, లార్డ్ జిమ్ ఓ’నీల్, గోల్డ్‌మన్ సాచ్స్ అసెట్ మేనేజ్‌మెంట్ మాజీ ఛైర్మన్, ప్రొ. VidaCaixa యొక్క నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ జోర్డి గువల్, బ్యాంక్ ఆఫ్ చైనాలో UK బోర్డు సభ్యుడు డాక్టర్ గెరార్డ్ లియోన్స్ మరియు HSBC మాజీ గ్రూప్ CEO & ఛైర్మన్ లార్డ్ స్టీఫెన్ గ్రీన్ తదితరులు పాల్గొననున్నారు.