Friday, November 22, 2024

ఉత్తరాఖండ్‌, నైనిటాల్ జిల్లాలో అంతుచిక్కని ఘటన.. విద్యుత్ కనెక్షన్ తీసేయించినా షార్ట్ సర్క్యూట్

ఈ నెల 8వ తేదీన చంద్ర‌గ్ర‌హ‌ణం..భూకంపం సంభ‌వించిన త‌ర్వాతి నుంచి ఓ ఇంట్లో ప్ర‌తిరోజు రాత్రి మంట‌లు చెల‌రేగుతున్నాయి. ఈ ఘ‌ట‌న ఉత్తరాఖండ్ నైనిటాల్ జిల్లాలోని హల్ద్వానీలో జరిగింది.కాగా ఫ‌స్ట్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలా జరుగుతుందేమోనని విద్యుత్ కనెక్షన్ తీయించారు. ఆ తర్వాతి కూడా ఇంట్లోని ఎలక్ట్రిక్ బోర్డులు, వైర్లు కాలిపోతుండడంతో వారిలో మరింత భయం పెరిగింది. విద్యుత్ కనెక్షన్ లేకుండా కూలర్‌ నుంచి మంటలు రావడం, బీరువాలోని దుస్తులు కాలిపోవడంతో భయంతో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఇంట్లో ఎర్తింగ్ సమస్య ఉందేమోనని విద్యుత్ శాఖ అధికారులను పిలిపించి ఎర్తింగ్ ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్థానిక మార్కెట్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమీపంలో కమల్ పాండేకు రెండంతస్తుల ఇల్లు ఉంది. అందులో కమల్ తమ్ముడు సహా 9 మంది కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు.

నవంబరు 8న చంద్రగ్రహణం తర్వాత సాయంత్రం ఏడు గంటల సమయంలో ఇంట్లోని విద్యుత్ బోర్డులో మంటలు చెలరేగాయి. దీంతో వాటిని ఆర్పివేశారు. ఎలక్ట్రీషియన్‌ను పిలిపించి బోర్డు సరిచేయించారు. అయితే, ఆ తర్వాతి రోజు టాయిలెట్‌లోని ఎలక్ట్రిక్ బోర్డులో మంటలు అంటుకున్నాయి. దీంతో ఇక లాభం లేదని విద్యుత్ కనెక్షన్‌ను పూర్తిగా తొలగించారు. అయితే, విచిత్రంగా ఆ తర్వాత కూడా కూలర్‌లో మంటలు చెలరేగాయి. బీరువాలోని దుస్తులకు మంటలు అంటుకున్నాయి. దీంతో భయపడిపోయిన కమల్ కుంటుంబం తమ ఇంటి ముందున్న ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడికి మకాం మార్చారు. ఇంటి వద్ద కాపలాగా ఇద్దరు సోదరులు ఇంటి వెలుపల నిద్రించేవారు. అయితే, ఆ తర్వాత కూడా మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. విషయం తెలిసిన సిటీ మేజిస్ట్రేట్ రిచా సింగ్ పోలీసులతో కలిసి ఇంటిని తనిఖీ చేశారు. మంగళవారం చివరిసారిగా ఆ ఇంట్లో మంటలు చెలరేగాయి. బుధవారం నుంచి మంటలు కనిపించలేదు. ఇంట్లో పదేపదే మంటలు చెలరేగుతుండడం వెనక ఏదైనా కుట్ర దాగి ఉండొచ్చని రిచా సింగ్ తెలిపారు. ఈ విషయాన్ని శాస్త్రీయంగా పరిశీలిస్తామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement