చేవేళ్ల – తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అలాగే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని అన్నారు.. బిజెపి ఆధ్వర్యంలో చేవేళ్లలో నిర్వహించిన విజయ సంకల్ప బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మరో 8 నెలలో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోబోతుందని అన్నారు.కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలని కలలు కంటున్నారని, అయితే, మోదీనే మళ్లీ ప్రధాని కాబోతున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. అసలు తెలంగాణలోనూ కేసీఆర్ మరోసారి గెలిచే అవకాశం లేదని అన్నారు. ఒవైసీ అజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని విమర్శించారు.
కేంద్రంలో ఫుల్ పిక్చర్ చూసే ముందు తెలంగాణలో ట్రైలర్ చూస్తారని అమిత్ షా అన్నారు. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలో వచ్చేముందు తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పారు. బీజేపీ కార్యకర్తలకు అండగా ఉంటామని, కేసీఆర్ అవినీతి పాలనపై పోరాటం చేయాలని అన్నారు. అలాగే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలా? వద్దా? అని కేంద్ర మంత్రి అమిత్ షా అడిగారు. ఢిల్లీలో మోడీకి వినపడేలా తెలంగాణ ప్రజలు ఈ విషయం చెప్పాలని అన్నారు. ఇక తెలంగాణలో పేపర్‌లీక్‌పై ప్రశ్నిస్తే మా నేతలను జైల్లో పెడతారా? అని నిలదీశారు..ఆ కేసులో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. పోరాటంలో జైళ్లకు వెళ్లేందుకు తమ పార్టీ కార్యకర్తలు ఎన్నడూ భయపడబోరని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదని చెప్పారు. అసెంబ్లీలో ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గలేదని గుర్తు చేస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఆయన తెలంగాణ ప్రజలను కోరారు.
..