కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో రైతు సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఇవ్వాల (ఆదివారం) ఆయన తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా మునుగోడులో జరిగే బహిరంగ సభకు హాజరయ్యేందుకు వచ్చారు. ఈ సందర్భంగా నిన్న (శనివారం) మునుగోడులో జరిగిన టీఆర్ ఎస్ ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ చట్టం రైతులకు ఇబ్బందిగా మారిందని, తాను బతికి ఉన్నంత వరకు అట్లాంటి చట్టం అమలు చేయబోనని చెప్పారు. అయితే.. ఇవ్వాల ఇదే అంశాన్ని అమిత్‌షాతో రైతు సంఘాల నేతలు లేవనెత్తారు. ఈ క్రమంలో అమిత్‌షా మాట దాటవేసే ధోరణిలో వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. విద్యుత్ చట్టం కాదు.. తెలంగాణ ప్రభుత్వాన్ని మార్చాలి అని అమిత్‌షా మాట్లాడినట్టు కొంతమంది రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.
ఇప్పటికిప్పుడు అయితే తాము ప్రభుత్వాలను మార్చలేమని, కానీ.. ఇట్లాగే రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా ప్రజలు, రైతులు వారి నిర్ణయం ఏంటనేది వచ్చే ఎన్నికల్లో తప్పకుండా స్పష్టం చేస్తారని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. మునుగోడు ఎన్నికకు ముందు అమిత్‌షా చేసిన ఈ వ్యాఖ్యలు ఆ పార్టీకి మున్ముందు మరింత ఇబ్బందులను తెచ్చేలా ఉన్నాయని ఆ పార్టీ లీడర్లు కొంతమంది అంటున్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా ఇప్పుడు ఈ అంశమే హాట్ టాపిక్ అయ్యింది.