ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్రం ఇస్తున్న జడ్ కెటగిరీ సెక్యూరిటీని అంగీకరించాలని ఇవ్వాల రాజ్యసభలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కోరారు. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని, యూపీ ప్రభుత్వం నుంచి నివేదిక కూడా కోరామని షా తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఒక కారు, రెండు పిస్టల్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై ఫోరెన్సిక్ బృందం విచారణ జరుపుతోందని, ఇద్దరు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు ఆయన చెప్పారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జడ్ కెటగిరీ భద్రతను అంగీకరించడానికి ఒవైసీ నిరాకరించినందున ఎంపీని మరోమారు అభ్యర్థిస్తున్నట్లు షా చెప్పారు. ఢిల్లీలో బుల్లెట్ ప్రూఫ్ కారుతో పాటు ఆల్ ఇండియా ప్రాతిపదికన అతనికి Z కేటగిరీ CRPF భద్రతను అందిస్తామని అమిత్ షా తెలిపారు.