హైదరాబాద్ నగరంలో నిర్వహించే ‘సండే ఫండే’ కార్యక్రమంపై ఒమిక్రాన్ ఎఫెక్ట్ పడింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో ఆదివారం(డిసెంబర్ 12) ‘సండే ఫండే’ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ట్యాంక్ బండ్ వద్ద ‘సండే-ఫన్డే’, పాతబస్తీలో ‘ఏక్ శాం-చార్మినార్ కే నామ్’ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. పరిస్థితులు కుదుటపడిన తర్వాత యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడించారు.
ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్, చార్మినార్ వద్ద నిర్వహిస్తున్న సండే ఫండే, ఏక్ శామ్ చార్మినార్ కే నామ్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రజలను అలరిస్తున్న విషయం తెలిసిందే. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో గతకొన్ని రోజులుగా ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సండే ఫండ్ కార్యక్రమానికి నగరవాసుల నుంచి విశేష స్పందన లభించింది. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతివారం సండే ఫండే కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.