రివర్స్ గేర్‌లో డొనాల్డ్ ట్రంప్
ఎలక్షన్ స్క్రీన్‌పై ఆంధ్రా అల్లుడు
ఉపాధ్యక్ష్య పదవికి రేసులో జేడీ వాన్స్
కృష్ణా జిల్లాలోని పామర్రుతో సంబంధాలు
రాజకీయాల్లో చక్రధారి ఆయన సతీమణే
అమెరికాలో అడ్వొకేట్‌గా పామర్రు ఆడబిడ్డ
అటు తమిళ పొన్ను.. ఇటు ఆంధ్రా బిడ్డ పోటాపోటీ
దక్షిణ భారతావనిలో పెద్ద ఎత్తున ఇదే చర్చ
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉండే అమెరికా రాజకీయ మనుగడను భారత్ శాసిస్తోందా? అక్కడి పాలిట్రిక్స్‌ని మనోళ్లు కంట్రోల్ చేస్తున్నారా?.. అక్కడి వర్థమాన రాజకీయాలు భారతదేశం మీదనే ఆధారపడ్డాయా?.. అధికార పీఠం దక్కాలంటే ప్రవాస భారతీయులే కీలకాధారమా?.. అంటే అవుననే అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.. అవును.. ఇప్పుడు అమెరికాలో భారత దేశం.. అందులోనూ దక్షిణాది వారి హవా కనిపిస్తోంది. ప్రధాన రాజకీయ పక్షాల ధొరణి కంప్లీట్‌గా మారిపోయింది. అమెరికాలో భారతీయ సంతతి అంటే.. పేరుకు వలస జీవులే. కానీ వీళ్లే అక్కడ రాజ్యాధికారంలోనూ భాగం పంచుకునే స్థితికి చేరుతున్నారు. నిజానికి అమెరికా జనాభాలో భారతీయులు సంఖ్య 1.85 శాతమే. ఇప్పుడు వీరు ఆర్థిక, రాజకీయ రంగాల్లోనూ కీలక దశకు చేరుకున్నారు. అందుకే.. అమెరికా ఉపాధ్యక్ష పదవిని ప్రవాస భారతీయులకు ఇవ్వాలనీ, అదీ దక్షిణాది రాష్ట్రాల సంతతి వారసులే ఉండాలనే ఒత్తిళ్లు కూడా ఉన్నట్టు స్పష్టం అవుతోంది.
ఆ మంత్రం పనిచేయకనే..
2021 నుంచి అమెరికా రాజకీయాల్లో అనూహ్య మార్పు వచ్చింది. ఈ ఎన్నికల్లో స్థానిక కార్డుతో రిపబ్లికన్ పార్టీ అధ్యక్షఅభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఓడిపోయారు. అమెరికాలో పుట్టినోళ్లకే ఉపాధి అవకాశాలు.. వలసల నియంత్రణ మంత్రం పనిచేయలేదు. ఎందుకంటే… ఆ ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ .. తొలిసారిగా భారతీయ సంతతికి చెందిన మహిళను ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేసింది. ఫలితంగా ప్రవాస భారతీయ ఓటు బ్యాంకు.. డెమోక్రాట్లకు మద్దతు పలికింది. ఇక.. ఈ సారి జరిగబోయే ఎన్నికల్లో హత్యాయత్నం సింపథీ కార్డు లాభించినా.. ప్రవాస భారతీయ ఓటు బ్యాంకుపై ట్పంప్ కన్ను పడింది. వన్ షాట్.. టూ బర్డ్స్ అన్నట్టు ఓ ఆంధ్రా అల్లుడిని ఉపాధ్యక్ష పదవి రేసులోకి దించారు. ఈ ఉపాధ్యక్ష పదవి రేసులో ఓ అమెరికన్ గుర్రంపై తమిళ పొన్ను జాకీ డెమోక్రాట్‌గా.. రిపబ్లికన్ గుర్రంపై ఓ ఓ తెలుగు తేజం సవారీ చేయనున్నారు.
ఆన్ స్క్రీన్ ఆంధ్రా అల్లుడు..
యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. మరోసారి భారతదేశ ప్రస్తావన వచ్చింది. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ భారత సంతతి బిడ్డే. ఇందుకు పోటీగా రిపబ్లికన్ల అభ్యర్థిగా అధ్యక్ష బరిలో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రివర్స్ గేర్ వేశారు. కీలక ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్‌ను ఎంపిక చేశారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. వాన్స్ సతీమణి ఒక తెలుగు అమ్మాయి. ఏపీ సంతతి వారసురాలు కావటంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
భారతీయులకు కీలక చాన్స్..
ఇప్పటి వరకూ ప్రవాస భారతీయులను తీవ్రంగా వ్యతిరేకించిన ట్రంప్.. అకస్మాత్తుగా తన వ్యూహం మార్చారు. అటు అమెరికా, ఇటు ప్రవాస భారతీయ ఓటు బ్యాంకును ఆకర్షించే క్రతువు ప్రారంభించారు. గెలుపే ధ్యేయంగా ఈ సారి ట్రంప్.. ఉభయ కార్డును ప్రయోగిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి వేళలో మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి ఆమోదం తెలపగా.. అదే సమయంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ జేడీ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలు అందించిన జేడీ వాన్స్ ఒహాయో స్టేట్ వర్సిటీ.. యేల్ లా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యారు. యేల్ లా జర్నల్ కు ఎడిటర్ గా వ్యవహరించారు.
ఆంధ్రుల ఆడబిడ్డగా..
ప్రవాస భారతీయుల్లో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే.. రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్ఆర్ఐలే కీలకం. అందుకే డెమోక్రాట్లు తమిళ పొన్ను కమలను రంగంలోకి దించి అధికారాన్నికైవసం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన రిపబ్లికన్లు తమిళ పొన్నుబలగానికి పోటీగా.. తెలుగింటి ఆడపడుచు ఉషా చిలుకూరిను రంగంలోకి దించారు. కానీ, ఇక్కడ ఆమె భర్త జేడీ వాన్స్అభ్యర్థి కాగా.. ఆయనను గెలిపించే బాధ్యత చిలుకూరి ఉషాదే.
కృష్ణా జిల్లాకు చెందిన పామర్రు..
ఆంధ్రప్రదేశ్‌లోని పామర్రుకు చెందిన చిలుకూరి కృష్ణ, లక్ష్మీ దంపతుల ముద్దు బిడ్డ ఉషా. అమెరికా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా జీవనం సాగించారు. ఆమె తల్లిదండ్రులు కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. ఆ రాష్ట్రంలోని శాన్‌డియాగోలోనే ఉషా పుట్టి పెరిగారు. కాగా, ఉషా.. యేల్ వర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి వర్సిటీ నుంచి ఫిలాసఫీలో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యాయ సంబంధమైన విబాగాల్లో సుదీర్ఘంగా పని చేసిన అనుభవం ఉంది. యేల్ వర్సిటీలో లా అండ్ టెక్ జర్నల్ కు మేనేజింగ్ ఎడిటర్ గా.. యేల్ లా జర్నల్ కు ఎగ్జిక్యూటివ్ డెవలప్ మెంట్ ఎడిటర్ గా పని చేశారు. కేంబ్రిడ్జి వర్సిటీకి గేస్ట్ ఫెలోగా వెళ్లారు. అక్కడ ఆమె లెఫ్ట్ వింగ్..లిబరల్ గ్రూప్స్ తో కలిసి పనిచేసేవారు. 2014లో ఉషా డెమోక్రాటిక్ పార్టీ కార్యకర్తగా తన పేరు నమోదు చేసుకోవటం విశేషం. యేల్ లా స్కూల్ లోనే జేడీ వాన్స్ ను ఉషా తొలిసారి కలిశారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. 2014లో కెంటకీలో పెళ్లి చేసుకున్నారు. భర్త కేథలిక్ క్రిష్టియన్.. ఉష హిందువు. వీరి వివాహం హిందూ సంప్రదాయంలో జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు.
అనూహ్యంగా ఉపాధ్యక్ష రేసులోకి..
గత నెలలో (జూన్)లో ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ తో జరిగిన ఇంటర్వ్యూలో తన భర్త ఉపాధ్యక్ష అభ్యర్థిత్వంపై సందిగ్థత నెలకొన్నట్లు ఉషా పేర్కొన్నారు. 2015 నుంచి పలు సంస్థల్లో కార్పొరేట్ లిటిగేటర్ గా పని చేస్తున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జాన్ రాబర్ట్స్ .. జస్టిస్ బ్రెట్ కెవానా వద్ద పని చేసిన అనుభవం ఆమెకు ఉంది. ఇక.. ఆమె భర్త కం ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన జేడీ వాన్స్.. 39 ఏళ్ల వయసులో అమెరికాసెనేట్ కు ఎన్నికయ్యారు. మొదట్లో ట్రంప్ విధానాల్ని ఆయన విమర్శించేవారు. తర్వాతి కాలంలో విధేయుడిగా మారారు. తాజాగా ట్రంప్ అధ్యక్ష రేసులో ఉంటే.. ఆయన ఏకంగా ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలవటం గమనార్హం. రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచార సభలో హత్యయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్న ట్రంప్ మీద పెద్ద ఎత్తున సానుభూతి వెల్లువెత్తుతున్న వేళ.. అధ్యక్ష.. ఉపాధ్యక్ష ఎన్నికలు రిపబ్లికన్లకు సానుకూలంగా మారనున్నట్లుగా అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగువారి అల్లుడు అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టే రోజు త్వరలోనే ఉందనే ప్రచారం జరుగుతోంది.