న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తున్న క్రమంలో రాజ్యాంగంలో పలు మార్పులు చేయాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలన్న కేసీఆర్ వ్యాఖ్యలపై కొన్ని పార్టీల నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర విదేశీ వ్యవహారాల కార్యదర్శి బి.రవి, హడ్కో సీఎండీ నాగరాజుతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించిన కొప్పుల ఈశ్వర్ ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం, బాధాకరమన్నారు. తమ పట్ల ప్రధాని అవలంభిస్తున్న వైఖరిని, వ్యవహరిస్తున్న తీరును ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారని కొప్పుల చెప్పారు. తెలంగాణ రాష్ట్రం, ప్రజల భవిష్యత్ గురించి ప్రధాని ఏనాడూ ఆలోచించలేదని, అసలే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సార్లు ఢిల్లీ వచ్చి వినతి పత్రాలు ఇస్తే ప్రధాని, మంత్రులు,
కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదన్నారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు నిధులివ్వడం, మిగతా రాష్ట్రాలను ఇబ్బందులకు గురి చేయడం అలవాటుగా మారిందని మంత్రి కొప్పుల ఆరోపించారు. తెలంగాణ భూభాగంలో ఉన్న సీలేరు పవర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చి మోడీ తమకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. రాష్ట్రం ప్రణాళికాబద్ధమైన కార్యాచరణతో ముందుకు సాగుతుండడంతో తండాలు, పల్లెలు, గ్రామాలు సకల సౌకర్యాలతో కళకళలాడుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. 40-45 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశమున్న అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని పలుమార్లు విన్నపాలు చేసినా కేంద్రం పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఐటీఆర్ ప్రాజెక్టుకు 49 వేల ఎకరాల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా కావాలనే కర్ణాటకకు తరలించారని ధ్వజమెత్తారు. గతంలో ప్రధానమంత్రులు ఎవరూ కూడా ఈ విధమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లు చూడలేదని కొప్పుల ఈశ్వర్ అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు విభజించిన రాష్ట్రాలలో సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రధాని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ, ఆరెస్సెస్ భావజాలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వ్యతిరేకమన్న ఆయన… ఎస్సీ, ఎస్టీల భద్రత, సంక్షేమం, ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో తెలంగాణ బీజేపీ ఎంపీలు ప్రజలకు చెప్పాలన్నారు.
అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్
ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఏర్పాటు జరిగిందన్న కొప్పుల అంబేడ్కర్125 వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ ఏడాది చివరకు విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని తెలిపారు. అందు కోసం ఢిల్లీలోని విగ్రహ తయారీ కేంద్రాలను పరిశీలించినట్టు చెప్పారు.