ప్రపంచ కుబేరుడు, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ సీఈవో జెఫ్ బెజోస్ తన పదవి నుంచి తప్పుకోనున్నారు. జూలై 5న తాను అమెజాన్ సీఈవో పదవి నుంచి తప్పుకుంటానని బెజోస్ తాజాగా ప్రకటించారు. తన స్థానంలో అమెజాన్ ఎగ్జిక్యూటివ్, వెబ్ సర్వీస్ హెడ్ ఆండీ జెస్సీ నూతన సీఈవోగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిపారు. ఇకపై బెజోస్ అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్పష్టత ఇచ్చారు జెఫ్ బెజోస్. జూలై 5న తాను సీఈవో పదవి నుంచి తప్పుకుంటానని.. ఆ రోజు నుంచి అమెజాన్ కొత్త సీఈవోగా ఆండీ జెస్సీ బాధ్యతలను చేపడతారని వెల్లడించారు. జులై 5 తనకు ఎంతో సెంటిమెంట్ అని.. అందుకే ఆ రోజే పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు జెఫ్ బెజోస్ తెలిపారు. బుధవారం జరిగిన అమెజాన్ షేర్ హోల్డర్స్ మీటింగ్‌లో ఈ ప్రకటన చేశారు.
77 ఏళ్ల బెజోస్ 1994లో అమెజాస్‌ను స్థాపించారు. ఇంటర్నెట్లో పుస్తకాలు అమ్మెందుకు ఈ సంస్థను ప్రారంభించారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా నిలిచింది. అంతేకాదు బెజోస్ ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ప్రస్తుతం అమెజాన్ ఆస్తుల విలువ 1.67 ట్రిలియన్ డాలర్లు.
ఇక కొత్త సీఈవోగా బాధ్యతలు తీసుకోనున్న ఆండీ జెస్సీ.. 1997లో అమెజాన్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా చేరారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగారు. 2003లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటులో జెస్సీ కీలక భూమిక పోషించారు. ప్రస్తుతం అమెజాన్ వెబ్ సర్వీసెస్ హెడ్‌గా ఉన్న ఆయన జులై 5న అమెజాన్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.